Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో చేసిన ఓ పోస్టు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ రచించిన ప్రేరణాత్మక కవితలోని కొన్ని పంక్తులను ఆయన పంచుకోవడంతో ఆ పోస్టుకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. పవన్ కల్యాణ్ షేర్ చేసిన కవితలో పోరాటం, సంకల్పం, సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగే వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే భావాలు ఉన్నాయి. ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో, ప్రాణాల్ని ఆటబంతుల్లా విసిరేస్తుందో, గెలుస్తుందో ఓడుతుందో కానీ ముందుకు పోతుందో… అదే నా రాస్తా” అంటూ ప్రారంభమయ్యే ఈ కవిత జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలనే సందేశాన్ని ఇస్తుంది.
అలాగే “ఏ రస్తాలో సంకెళ్లు కూడా సవాల్ చేస్తాయో, అపజయం కూడా అగ్నిజ్వాలై మండుతుందో, మరణం మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో… అదే నా రాస్తా” అనే పంక్తులు ప్రస్తుతం పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణానికి అన్వయిస్తూ పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించాలనే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ పోస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాలపై కీలక ప్రకటన చేశారు. 2029లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తప్పకుండా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో కూడా పార్టీ బరిలోకి దిగుతుందని వెల్లడించారు.
పొత్తులతో ఎన్నికలకు వెళ్తారా? లేక స్వతంత్రంగా పోటీ చేస్తారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ, ఆ నిర్ణయం కాలమే నిర్ణయిస్తుందని పవన్ చెప్పారు. రాజకీయంగా ఎవరు తోడుగా వచ్చినా రాకపోయినా ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై నిరంతరం ప్రశ్నించే శక్తిగా జనసేన నిలుస్తుందని పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణలో పార్టీ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న పవన్ కల్యాణ్, తాజా కవితా పోస్టు ద్వారా కూడా తన రాజకీయ ఆలోచనలకు ప్రత్యేక సంకేతాలు ఇచ్చారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణలో పార్టీ విస్తరణ, భవిష్యత్ ఎన్నికల ప్రణాళికల నేపథ్యంలో పవన్ చేసిన ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో
ప్రాణాల్ని ఆటబంతుల్లా
విసిరేస్తుందో
గెలుస్తుందో ఓడుతుందో
కానీ ముందుకు పోతుందో
అదే నా రస్తా
ఏ రస్తాలో సంకెళ్లు కూడా
సవాల్ చేస్తాయో
ఏ రస్తాలో అపజయం కూడా
అగ్నిజ్వాలై మండుతుందో
ఏ రాస్తాలో మరణం
మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో
అదే నా రాస్తా…… pic.twitter.com/VTwKD00zW2— Pawan Kalyan (@PawanKalyan) June 3, 2026