NTR | తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోల అభిమానులు తమ అభిమానాన్ని వివిధ రూపాల్లో చాటుకుంటుంటారు. సేవా కార్యక్రమాలు నిర్వహించడం, అభిమాన సంఘాలు ఏర్పాటు చేయడం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం సాధారణమే. అయితే తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఏర్పడినట్లు ప్రచారం జరుగుతున్న ‘రా ఎన్టీఆర్’ సంస్థ వివాదం.. అభిమానుల మధ్యే విభేదాలకు దారితీసి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ‘రా ఎన్టీఆర్’ పేరుతో ఒక సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, తిరుపతిలో భారీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ హాజరవుతారని, వంద కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలు చేపడతామని, అందుకోసం విరాళాలు కూడా సేకరిస్తున్నట్లు పలు పోస్టులు వైరల్ అయ్యాయి.
దీంతో ఈ కార్యక్రమం ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి సంబంధించినదా అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఈ ప్రచారం నేపథ్యంలో ఎన్టీఆర్ అధికారిక బృందం స్పష్టత ఇచ్చింది. విడుదల చేసిన ప్రకటనలో ‘రా ఎన్టీఆర్’ సంస్థకు తమతో ఎలాంటి సంబంధం లేదని, ఎన్టీఆర్ పేరు లేదా ఆయన ఫోటోలను అనుమతి లేకుండా ఉపయోగించవద్దని పేర్కొంది. అలాగే ఆ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, ప్రచారాలు లేదా ప్రకటనలకు ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి అధికారికంగా తెరపడింది. ఎన్టీఆర్ టీమ్ ప్రకటన తర్వాత అభిమానుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒక వర్గం అభిమానులు ‘రా ఎన్టీఆర్’ పేరుతో ఎన్టీఆర్ ఇమేజ్ను దెబ్బతీయొద్దని, ఆయన పేరుతో విరాళాలు సేకరించడం సరికాదని విమర్శిస్తున్నారు.
మరోవైపు ‘రా ఎన్టీఆర్’ సంస్థ ప్రతినిధులు మాత్రం తాము గత ఏడేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, తమ ఉద్దేశం కేవలం సేవ మాత్రమేనని చెబుతున్నారు. ఎన్టీఆర్‌పై తమకు అపారమైన గౌరవం ఉందని, ఆయన స్వయంగా ఆపమంటే వెంటనే అన్ని కార్యక్రమాలు నిలిపివేస్తామని కూడా వారు పేర్కొంటున్నారు. అయితే ఎన్టీఆర్ వ్యక్తిగత పీఆర్ టీమ్ అధికారికంగా ప్రకటన విడుదల చేసిన తర్వాత కూడా, “ఆ విషయాలు ఎన్టీఆర్‌కు తెలిసి ఉండకపోవచ్చు” అని ‘రా ఎన్టీఆర్’ సంస్థ స్పందించడం మరిన్ని సందేహాలకు తావిచ్చింది. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్‌గా మారింది. ఒక వర్గం ఎన్టీఆర్ పేరును అనధికారికంగా వినియోగించడం సరికాదని వాదిస్తుండగా, మరో వర్గం సేవా కార్యక్రమాల ఉద్దేశాన్ని సమర్థిస్తోంది.