సినిమా : ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్
తారాగణం: నితిన్, శ్రీలీల, డా.రాజశేఖర్, సుదేవ్ నాయర్, రావురమేశ్, సంపత్ రాజా..
దర్శకత్వం: వక్కంతం వంశీ
నిర్మాతలు: సుధాకరరెడ్డి, నిఖితారెడ్డి
Actor Nithiin | కెరీర్లో ఒడిదుడుకులు చూసిన హీరో నితిన్. ఒకానొక దశలో వరుస పరాజయాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లి మళ్లీ విజయాలను అందుకున్నాడు నితిన్. ‘ఇష్క్’తో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టి వరుస విజయాలతో దూసుకుపోయాడు. అయితే, మళ్లీ కాస్త విజయాలకు బ్రేక్ వచ్చింది. అందుకే.. ఇప్పుడు విజయమే లక్ష్యంగా పూర్తి వినోదభరిత కథాంశాన్ని ఎంచుకొని వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ చేశాడు నితిన్. అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ తర్వాత వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన సినిమా ఇదే కావడం, ఇందులో డాక్టర్ రాజశేఖర్ ప్రత్యేక పాత్ర పోషించడంతో సినిమాపై అంచనాలు బాగా ఏర్పాడ్డాయి. పైగా ఈ సినిమా ట్రైలర్స్, టీజర్స్ కూడా జనాదరణ పొందాయి. ఇన్ని అంచనాల నడుమ శుక్రవారం విడుదలైన ఈ సినిమా విజయాన్ని అందుకుందా? మళ్లీ నితిన్ సక్సెస్ ట్రాక్ ఎక్కాడా? అనేది తెలుసుకోవాలంటే ముందు కథలోకెళ్దాం.
అభి(నితిన్) ఓ జూనియర్ ఆర్టిస్ట్. ఎలాగైనా పెద్ద హీరో అవ్వాలనేది అతని యాంబిషన్. అయితే తను ఏ సినిమాకు పనిచేసినా అతన్ని కెమెరాకు అందనంత దూరంగా ఉంచుతుంటారు దర్శకులు. దాంతో అభి తెగ బాధపడిపోతుంటాడు. అలాంటి సమయంలో అతనికి లిఖిత(శ్రీలీల) పరిచయం అవుతుంది. దాంతో అభి జీవితం పూర్తిగా మారిపోతుంది. తను కూడా అదే కంపెనీలో సీఈవో స్థాయికి ఎదుగుతాడు. అయితే ఉన్నట్టుండి అభికి ఓ సినిమాలో హీరో ఛాన్స్ వస్తుంది. కోటియా అనే గ్రామంలో జరిగిన ఓ రియల్ స్టోరీ ఆధారంగా తయారైన కథ అది. ఆ గ్రామంలో నీరో అనే దుర్మార్గుడు ఉంటాడు. వాడ్ని చంపి ఆ గ్రామాన్ని ఆ గ్రామస్తుల్ని కాపాడటానికి సైతాన్ అనే పోలీస్ ఎలాంటి సాహసాలు చేశాడనేది ఆ సినిమా కథ. కథ నచ్చి ఉద్యోగాన్ని కూడా పక్కనపెట్టి సినిమా చేయడానికి ఒప్పుకుంటాడు. తీరా సినిమా సెట్‌కి వెళ్లే సమయానికి అభిని హీరోగా తప్పించి మరో హీరోతో సినిమా చేయడానికి దర్శకుడు రెడీ అవుతుంటాడు. ఇలా అస్థవ్యస్తమైన పరిస్థితుల మధ్య కథ అనుకోని మలుపు తిరుగుతుంది. ఎవరి కథ ఆధారంగా అయితే, ఈ సినిమా తెరకెక్కుతున్నదో అదే దుర్మార్గుడు నీరోతో నిజంగానే అభి తలపడాల్సొస్తుంది. అసలు అభికి ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైంది? మరి అభీకీ, నీరోకి జరిగిన యుద్ధంలో ఎవరు గెలిచారు? అనేది మిగతా కథ.
ఓ మంచి ఛేజింగ్ సీన్, ఆ తర్వాత ఓ స్మగ్లర్కి హీరో కథ చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. కథ పాతదే. ఈ తరహా కథలు చాలానే వచ్చాయి. అయితే.. కొన్ని ట్విస్టులతో మంచి వినోదాన్ని పంచాడు దర్శకుడు. జూనియర్ ఆర్టిస్ట్‌గా హీరో పడే ఇబ్బందులు, హీరో ఇంట్లో సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన సన్నివేశాల్లో ఫీల్ కరువైందనే చెప్పాలి. ఇంటర్వెల్ బ్యాంగ్ ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచేలా ఉంది. నవ్వించటమే లక్ష్యంగా తీసిన సినిమా ఇది. అందుకే లాజిక్కుల గురించి దర్శకుడు పెద్దగా పట్టించుకోలేదు. పైగా కథలో లేని కామెడీ ట్రాకులు పంటికింద రాళ్లలా అనిపిస్తుంది. ద్వితీయార్థంలో కూడా ప్రేక్షకుల్ని కట్టిపడేసే ఎమోషస్సేం ఉండవు. కేవలం వినోదమే ప్రధానంగా తీయబడ్డట్టుగా సినిమా ఉంటుంది.
నటీనటుల నటన
నితిన్ ఎప్పటిలాగే బాగా చేశాడు. నటన పరంగా అతన్ని వేలెత్తి చూపించేదేమీ లేదు. శ్రీలీల పాత్ర నిడివి చిన్నది. అయినా తన అందంతో చలాకీ తనంతో ఆకట్టుకుంది. ఇక రాజశేఖర్ చేసిన పాత్ర ఆయన స్థాయికి తగ్గ పాత్ర కాదేమో అనిపిస్తుంది. నటన పరంగా రాజశేఖర్ గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది? రావురమేశ్, సంపత్.. తదితరులందరూ బాగా చేశారు.
టెక్నికల్‌గా
దర్శకుడు వక్కంతం వంశీ నిజానికి దూరంగా కథ రాసుకున్నాడు. లాజిక్కులతో పనిలేకుండా కథ, కథనాలు సాగాయి. ద్వితీయార్థం కూడా రొటీన్‌గానే అనిపిస్తుంది. కాకపోతే హీరోయిజాన్ని ఎస్టాబ్లిష్ చేసే సీన్స్‌లో దర్శకుడిగా మెరిశాడు వక్కంతం వంశీ. ఆయన మంచి కథకుడు. మరి ఆయన దర్శకత్వంలో సినిమా అంటే ఎలాంటి కథను ఎంచుకుంటాడో అనే క్యూరియాసిటీ ఆడియన్స్‌లో ఉంటుంది. కానీ సాదాసీదా కథతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇక ఆర్థర్ ఎ.విల్సన్, యువరాజ్, సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతి ఫ్రేమూ రిచ్‌గా చిత్రీకరించారు. హేరిస్ జైరాజ్ నేపథ్య సంగీతం బావుంది. పాటలు ఓకే అనిపిస్తాయి. ఎడిటర్కైతే ఇంకాస్త పనుంది. కత్తెరకు పనిచెప్పాల్సిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. మొత్తం సినిమా పర్వాలేదనిపిస్తుంది. లాజిక్కులతో పనిలేని వినోదభరిత చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చొచ్చు.
ప్లస్ పాయింట్స్: నితిన్ నటన, వినోదం, ఇంటర్వెల్ బ్యాంగ్
మైనస్ పాయింట్స్ : కథ, రొటీన్ సన్నివేశాలు
రేటింగ్ : 3/5