‘పర్సనల్ లైఫ్లో నాకూ కొన్ని ప్రేమకథలు ఉన్నాయి. వాటిల్లోని ఓ పాయిట్ని టచ్ చేసేలా ఈ సినిమా కథ సాగింది. యువతరానికి కనెక్టయ్యే అంశాలన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయి. 20ఏళ్ల కెరీర్ తర్వాత నాలోవున్న కొత్తకోణాన్ని ఆవిష్కరిస్తూ చేసిన సినిమా ఇది’ అన్నారు హీరో నవదీప్. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘లవ్, మౌళి’. అవనీంద్ర దర్శకుడు. సి స్పేస్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకొని ‘ఏ’సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. జూన్ 7న సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నవదీప్ మాట్లాడారు. ‘ప్రేమించి పెళ్లాడిన జంటలు కూడా బ్రేకప్ అవుతున్నాయి. కాంప్రమైజ్ అయితే తప్ప రిలేషన్స్ నిలబడవా? అనే ప్రశ్నకు సమధానం ‘లవ్, మౌళి’. నవదీప్ ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాడు. తనకు తగిన ప్రతిఫలం లభిస్తుందనే నమ్మకం ఉంది’ అని దర్శకుడు అన్నారు. పంఖురి గిద్వానీ, భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోవింద్ వసంత్, సమర్పణ: నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్.