నరేశ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఉగ్రం’. మిర్నా మీనన్ నాయికగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకుడు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్రంలోని తొలి పాట ‘దేవేరి’ని విడుదల చేశారు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యాన్ని అందించగా అనురాగ్ కులకర్ణి పాడారు. హీరో నరేశ్ మాట్లాడుతూ…‘నేను యాభై కామెడీ సినిమాలు చేసిన తర్వాత సీరియస్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్నా. దీనికి కారణం ప్రేక్షకులు ఇచ్చిన నమ్మకమే. మంచి సినిమా చేస్తే తప్పకుండా మీరు ఆదరిస్తారు.
పాండమిక్ తర్వాత దేశంలో వేగంగా కోలుకున్న తొలి చిత్ర పరిశ్రమ మనదే. అందుకు కారణం అభిరుచి గల మన ప్రేక్షకులు అని అనుకోవచ్చు. ఇది నా కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ. దేవేరి పాట అందంగా పిక్చరైజ్ చేశాం. సమ్మర్లో సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం’ అని అన్నారు. దర్శకుడు విజయ్ కనకమేడల మాట్లాడుతూ…‘పాట బ్యూటిఫుల్‌గా వచ్చింది. ఇందులోని విజువల్స్ ఆకట్టుకుంటాయి. సినిమాకు ఈ పాట ఆకర్షణ అవుతుందని ఆశిస్తున్నాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.