Nana Patekar | విలక్షణ నటనకు, గొప్ప మనసుకు మారుపేరుగా నిలిచిన సీనియర్ నటుడు నానా పటేకర్ ఇక లేరన్న వార్త యావత్ భారత సినీ అభిమానులను విషాదంలోకి నెట్టింది. గోవాలోని తన నివాసంలో గురువారం తెల్లవారుజామున గుండెపోటుకు గురైన ఆయన 75 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు వెండితెరపై ఎన్నో మరపురాని పాత్రలు పోషించిన నానా పటేకర్.. సినిమాలతో మాత్రమే కాకుండా తన వ్యక్తిత్వంతోనూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. సినీ పరిశ్రమలో స్టార్డమ్ వచ్చిన తర్వాత విలాసవంతమైన జీవితం గడపడం, ఖరీదైన కార్లు, భారీ ఇళ్లు కొనుగోలు చేయడం సాధారణంగా కనిపిస్తుంటుంది. కానీ నానా పటేకర్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జీవించారు. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నప్పటికీ అత్యంత సాధారణ జీవనశైలిని కొనసాగించారు.
సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని అవసరాల్లో ఉన్నవారికి, ముఖ్యంగా రైతు కుటుంబాలకు అందిస్తూ తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. నానా పటేకర్ నికర ఆస్తులపై అధికారికంగా పూర్తి వివరాలు అందుబాటులో లేవు. అయితే వివిధ మీడియా కథనాల ప్రకారం ఆయన ఆస్తుల విలువ సుమారు రూ.50 కోట్ల నుంచి రూ.80 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. తన కెరీర్లో అత్యంత డిమాండ్ ఉన్న నటుడిగా ఎదిగిన సమయంలో ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల్లో పారితోషికం అందుకున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రకటనల ద్వారా కూడా ఆయనకు ఆదాయం లభించేది. అయితే నానా పటేకర్ ఈ స్థాయికి రావడం వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి. కెరీర్ ప్రారంభ రోజుల్లో ఆయన ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండేది. తన చిన్ననాటి రోజులను గుర్తుచేసుకుంటూ.. తాను 13 ఏళ్ల వయసులో సినిమా పోస్టర్లు పెయింట్ చేసేవాడినని, ఆ పని ద్వారా నెలకు కేవలం రూ.35 మాత్రమే సంపాదించేవాడినని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అక్కడి నుంచి బాలీవుడ్లో స్టార్ నటుడిగా ఎదిగి కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి చేరుకోవడం వెనుక ఆయన పట్టుదల, కష్టపడే తత్వం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. నానా పటేకర్కు ముంబైలో విలువైన నివాసంతో పాటు గోవాలోనూ ఇల్లు ఉన్నట్లు సమాచారం. ఆయన వద్ద ఖరీదైన వాహనాలు కూడా ఉన్నాయి. అయితే వాటిని ప్రదర్శిస్తూ ఆర్భాటం చేయడం ఆయనకు ఎప్పుడూ అలవాటు కాలేదు. సినీ వేడుకల్లోనూ సాధారణ దుస్తుల్లో కనిపించడం, గ్రామీణ ప్రాంతాల్లో రైతులతో కలిసి పనిచేయడం, అవసరమైన వారికి సహాయం చేయడం నానా పటేకర్కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. సంపద పెరిగినా జీవన విధానంలో మాత్రం పెద్దగా మార్పు రాకపోవడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలిచింది. నానా పటేకర్ సేవా కార్యక్రమాల్లో రైతుల సంక్షేమానికి ప్రత్యేక స్థానం ఉంది. రైతుల కష్టాలను దగ్గరగా చూసిన ఆయన.. సామాజిక కార్యకర్త మకరంద్ అనాస్పురేతో కలిసి ‘నామ్ ఫౌండేషన్’ ద్వారా రైతు కుటుంబాలకు అండగా నిలిచారు. ముఖ్యంగా రైతు ఆత్మహత్యలతో తీవ్రంగా ప్రభావితమైన కుటుంబాలకు సహాయం అందించడంలో నానా పటేకర్ ముందుండేవారు.
ఖరీదైన కారు కొనుగోలు చేయడం కంటే ఆ మొత్తంతో కష్టాల్లో ఉన్న రైతు కుటుంబాలకు సహాయం చేయడం ఎంతో ముఖ్యమనే భావనను ఆయన పలుమార్లు వ్యక్తం చేసినట్లు ఆయన సన్నిహితులు, సహచరులు గుర్తుచేస్తుంటారు.అందుకే నానా పటేకర్ కేవలం ఒక గొప్ప నటుడిగానే కాకుండా.. తన సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచనతో జీవించిన వ్యక్తిగా గుర్తుండిపోతారు.