Nana Patekar | సీనియర్ నటుడు నానా పటేకర్ ఆకస్మిక మరణం సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 75 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూయడంతో బాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. మరింత విషాదకరమైన విషయం ఏమిటంటే.. మరణానికి కేవలం నాలుగు రోజుల ముందు వరకు ఆయన ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా కనిపించారు. గోవాలో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నానా పటేకర్ తనదైన శైలిలో ప్రసంగిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఇంత త్వరగా ఆయన కన్నుమూస్తారని ఎవరూ ఊహించలేకపోయారు. అక్టోబర్ 4న గోవాలో జరిగిన ‘సమ్రాట్ క్లబ్ ఇంటర్నేషనల్’ స్వర్ణోత్సవ వేడుకలకు నానా పటేకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెల్లటి కుర్తా, భుజంపై గమ్ఛాతో ఆయన ఎప్పటిలాగే ఎంతో నిరాడంబరంగా కనిపించారు. కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న ఆయన తన ప్రసంగంతో అక్కడున్న వారిని ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటిలో నానా పటేకర్ ఎంతో ఆరోగ్యంగా, చురుగ్గా కనిపించారు. అయితే అదే ఆయన చివరిసారిగా ప్రజల మధ్య కనిపించిన సందర్భంగా మారడం అభిమానులను మరింత కలచివేస్తోంది. గోవాలోని డోనా పౌలా ప్రాంతంలోని తన నివాసంలో నానా పటేకర్ గురువారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే వైద్యులకు సమాచారం అందించారు. వైద్య బృందం ఆయన నివాసానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఆసుపత్రికి తరలించింది. అక్కడ వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసి ఆయన ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే ఎలాంటి స్పందన రాకపోవడంతో ఉదయం 5:20 గంటలకు నానా పటేకర్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఈ ఘటనపై మెడికో-లీగల్ కేసు నమోదు చేసినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఆయన మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు కుటుంబ సభ్యులు, అధికారులు వెల్లడించాల్సి ఉంది. విశ్వనాథ్ పటేకర్గా జన్మించిన నానా పటేకర్ 1978లో ‘గమన్’ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత హిందీ, మరాఠీ చిత్రాల్లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారు. నటనలో తనదైన శైలిని ఏర్పరుచుకున్న ఆయన.. పాత్ర ఏదైనా అందులో పూర్తిగా లీనమై ప్రేక్షకులను మెప్పించేవారు. ‘పరిందా’, ‘క్రాంతివీర్’, ‘అగ్నిసాక్షి’, ‘అబ్ తక్ ఛప్పన్’, ‘వెల్కమ్’ వంటి చిత్రాల్లో ఆయన నటనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ముఖ్యంగా ఆయన పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ, ప్రత్యేకమైన హావభావాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నానా పటేకర్‌కు దేశ సేవపై కూడా ప్రత్యేక ఆసక్తి ఉండేది. టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్‌గా ఆయన సేవలందించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొనేవారు. ఆయన మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటని పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.