మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందించిన ‘మయూఖ’ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకురానుంది. పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీతేజ ఎస్.కె దర్శకుడు. శశిధర్ నల్ల నిర్మించారు. బుధవారం దర్శకుడు శ్రీతేజ విలేకరులతో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాకు ఇటీవల జరిగిన న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ మిస్టరీ ఫిల్మ్ అవార్డ్ వచ్చిందని తెలిపారు.
‘కథానాయిక ఉండే ఫ్లాట్‌లోకి ఒక అపరిచిత వ్యక్తి ఎందుకు వచ్చాడు? అతను ఏం చేశాడు? హీరోయిన్‌తో అతనికి ఉన్న సంబంధం ఏమిటి? అనే ఆంశాలు ఈ కథలో ఉత్కంఠను కలిగిస్తాయి. ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతూనే గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించే చిత్రమిది’ అన్నారు. తాను 20ఏళ్ల క్రితం షార్ట్ ఫిల్మ్స్ రూపొందించానని, ఆ తర్వాత అమెరికా వెళ్లానని, అక్కడ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డైరెక్షన్ కోర్స్ చేశానని శ్రీతేజ తెలిపారు.