Mangli | తెలంగాణ జానపద గీతాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ప్రముఖ గాయని మంగ్లీ అభిమానుల మనసు గెలుచుకుంది. తాజాగా ఆమె ఓ అభిమానికి ఇచ్చిన సర్ప్రైజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంగ్లీకి వీరాభిమాని అయిన ఓ ఆటో డ్రైవర్ తన ఆటోకు ‘మంగ్లీ ఎక్స్‌ప్రెస్’ అని పేరు పెట్టి తన అభిమానాన్ని ప్రత్యేకంగా చూపించాడు. ఇదే ఆటోను రోడ్డుపై చూసిన మంగ్లీ, అతన్ని సర్ప్రైజ్ చేయాలని నిర్ణయించుకుంది. కొంత దూరం ఆ ఆటోను ఫాలో అయిన ఆమె, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆ ఆటో డ్రైవర్ దగ్గరకు వెళ్లి పలకరించింది. అకస్మాత్తుగా తన అభిమాన గాయని ఎదురుగా రావడంతో ఆ ఆటోవాలా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మంగ్లీ అతనితో కలిసి సెల్ఫీ దిగడం, కాసేపు మాట్లాడడం ఆ అభిమానికి మరపురాని క్షణంగా మారింది.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను మంగ్లీ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భావోద్వేగ పోస్ట్ పెట్టింది. “ఈ రోజు నా మనసు ఎంతో కదిలిపోయింది. ఒక అభిమాని తన ఆటోపై నా పేరును ‘మంగ్లీ ఎక్స్‌ప్రెస్’గా రాసుకోవడం చిన్న విషయం అనిపించినా, అది నాకు ఎంతో విలువైనది. ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమే నాకు ప్రేరణ” అంటూ రాసుకొచ్చింది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ, మంగ్లీ సరళతను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. నడిరోడ్డుపై అభిమానితో కలిసిపోవడం ఆమె వినమ్రతను చాటిందని కామెంట్లు చేస్తున్నారు.
ఇక మంగ్లీ జర్నీ విషయానికి వస్తే ఆమె అసలు పేరు సత్యవతి చౌహాన్. ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన ఆమె, తెలంగాణ జానపద గీతాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. టీవీ ప్రోగ్రామ్‌లతో ప్రారంభమైన ఆమె ప్రయాణం, జానపద పాటల ద్వారా గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించింది. బోనాలు, బతుకమ్మ పండుగల సందర్భంగా ఆమె పాడిన పాటలు విపరీతంగా పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలు అందుకొని వరుస హిట్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘శైలజా రెడ్డి అల్లుడు’తో సినీ ప్రయాణం మొదలుపెట్టిన ఆమె, ‘రాములో రాములో’, ‘సారంగదరియా’, ‘భూమ్ బద్దల్’ వంటి పాటలతో భారీ క్రేజ్ సంపాదించింది. తాజాగా వచ్చిన పాటలతో కూడా ఆమె ట్రెండ్‌లో కొనసాగుతోంది. ఇటీవల కాలంలో మంగ్లీ కొన్ని వివాదాల్లో కూడా నిలిచింది. ‘సర్కే చునర్ తేరి సర్కే’ పాటపై విమర్శలు రావడంతో ఆమె క్షమాపణలు తెలిపింది. అలాగే తన పేరుతో మైక్రో ఫైనాన్స్ వ్యాపారం జరుగుతోందన్న వార్తలను ఖండిస్తూ, తనకు వాటితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.