‘రాకాస’ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమవుతున్నది మానస శర్మ. కామెడీ, హారర్, ఫాంటసీ అంశాలు కలబోతగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకురానుంది. సంగీత్శోభన్, నయన్సారిక జంటగా నటించిన ఈ చిత్రానికి నిహారిక కొణిదెల నిర్మాత. ఈ సందర్భంగా మంగళవారం దర్శకురాలు మానసశర్మ విలేకరులతో సినిమా విశేషాలను పంచుకుంది. తన నేపథ్యం గురించి చెబుతూ ‘మాది శ్రీకాకుళం. తొలుత నేను యూట్యూబ్‌లో ‘మ్యాడ్‌హౌస్’ అనే షార్ట్‌ఫిల్మ్ చేశా. ఆ తర్వాత ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి క్రియేటర్‌గా వ్యవహరించా.
ఆ తర్వాత ‘బెంచ్లైఫ్’ అనే సిరీస్‌ను చేశాను’ అని చెప్పింది. ‘రాకాస’లో హారర్ ఎలిమెంట్స్ కొద్దిమోతాదులోనే ఉంటాయని, ఎక్కువగా ఫాంటసీ, అడ్వెంచర్ అంశాలపై దృష్టి పెట్టామని తెలిపింది. ఈ తరహా చిత్రాలను థియేట్రికల్‌గానే ఎక్స్పీరియన్స్ చేయాలని, అందమైన చందమామ కథలా అబ్బురపరిచే విజువల్స్‌తో ఆకట్టుకుంటుందని మానసశర్మ పేర్కొన్నది.
నిర్మాత నిహారిక కొణిదెల చక్కటి ప్రణాళికతో చిత్రాన్ని పూర్తి చేశారని, తన ప్రొడక్షన్స్‌లో పనులన్నీ చకచకా జరిగిపోతాయని చెప్పింది. ఎలాంటి సినిమా చేసినా అందులో వినోదం తప్పకుండా ఉండేలా చూసుకుంటాను అని మానసశర్మ వివరించింది.