Mahesh | ప్రస్తుతం సినిమా, వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్‌ల ప్రమోషన్స్ కోసం కొత్త కొత్త పద్ధతులు అనుసరించడం సాధారణమైపోయింది. సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి కొందరు సెలబ్రిటీలు వినూత్నమైన మార్గాలను ఎంచుకుంటుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ప్రమోషనల్ స్టంట్స్ ప్రేక్షకులను అయోమయానికి గురిచేస్తూ విమర్శలకు కూడా దారితీస్తున్నాయి. ఇటీవల కమెడియన్, నటుడు రంగస్థలం మహేష్ చేసిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న మహేష్, ‘రంగస్థలం’ సినిమాలో రామ్ చరణ్ పక్కన నటించి మరింత పాపులారిటీ సంపాదించారు. ప్రస్తుతం సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఆయన తాజాగా చేసిన పోస్టులు అభిమానులను ఆందోళనకు గురిచేశాయి.
కొద్ది రోజుల క్రితం మహేష్ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో నిజానిజాలు తెలియకుండా ఎవరూ మాట్లాడొద్దు. త్వరలోనే అన్ని విషయాలు చెబుతాను అంటూ ఎమోషనల్‌గా మాట్లాడారు. దీంతో ఆయన అభిమానులు, ఫాలోవర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మహేష్ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్య వచ్చిందా? కుటుంబ పరమైన ఇబ్బందులా? లేక కెరీర్‌కు సంబంధించిన సమస్యలేమైనా ఉన్నాయా? అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొందరు అభిమానులు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కూడా ఆరా తీశారు.
ఇదే సమయంలో మరో వీడియోను విడుదల చేసిన మహేష్, భార్యాభర్తల మధ్య వివాదాలను పరిష్కరించే ఓ కార్యక్రమానికి వెళ్లినట్లు చూపించారు. ఆ వీడియోలో ఓ మహిళ ముఖాన్ని చూపించకుండా, విడాకుల అంశంపై తీవ్ర వాగ్వాదం జరుగుతున్నట్లు కనిపించింది. మహేష్ మాట్లాడిన తీరు, సంభాషణలు చూసిన చాలా మంది ఇది నిజంగానే ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశమని భావించారు. అయితే తర్వాత అసలు విషయం బయటపడింది. ఇవన్నీ మహేష్ నటించిన ‘డి ఫర్ డివోర్స్’ అనే షార్ట్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా చేసిన వీడియోలని తెలిసింది. దీంతో సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ప్రేక్షకులు ఈ ప్రమోషన్ పద్ధతిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “నిజంగా కంగారు పడ్డ అభిమానుల పరిస్థితి ఏమిటి?”, “ప్రమోషన్ కోసం ఇలాంటి వ్యక్తిగత విషయాలను ఉపయోగించడం సరైనదేనా?” అంటూ ప్రశ్నిస్తున్నారు.