ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం ద్వారా దక్షిణాదిలో అరంగేట్రం చేస్తున్నది అందాల భామ జాన్వీకపూర్. బాలీవుడ్లో ఆమెకు విజయాల శాతం తక్కువే అయినా కథాంశాల ఎంపికలో వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తుందనే పేరుంది. ఐదేళ్ల కెరీర్లో నటిగా ప్రతి సినిమాకు పరిణితి సాధించింది. ఇటీవల తన సోదరి ఖుషీకపూర్‌తో కలిసి ‘కాఫీ విత్ కరణ్’షోలో పాల్గొంది జాన్వీకపూర్. ఈ సందర్భంగా తన తొలి తెలుగు చిత్రం ‘దేవర’ను ప్రశంసలతో ముంచెత్తింది. ఈ సినిమా ద్వారా నటిగా తన అసలైన ప్రతిభ ఏమిటో తెలుసుకున్నానని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘ఇప్పటివరకు నేను చేసిన సినిమాలతో పోల్చితే ‘దేవర’ చాలా ప్రత్యేకం. సెట్స్‌లో అడుగుపెట్టిన దగ్గరి నుంచి ప్రతీ రోజు ఓ కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నా. నటిగా నా నిజమైన సామర్థ్యం ఏమిటో ఈ సినిమా ద్వారా తెలిసింది. మొత్తంగా చెప్పాలంటే ఈ సినిమాతో ఓ నటిగా, వ్యక్తిత్వపరంగా నన్ను నేను కొత్తగా తెలుసుకున్నా’ అని చెప్పింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నది. తొలిభాగం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది.