Kiku Chiranjeevi Movie | ఎడమవైపు ఉండాల్సిన గుండె కుడివైపు ఉంటే శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఆ అరుదైన పరిస్థితిని ఎదుర్కొన్న హీరో జీవితంలో ఎలాంటి అనూహ్య మలుపులు చోటుచేసుకున్నాయి? ఈ ఆసక్తికరమైన పాయింట్‌తో తెరకెక్కిన చిత్రమే ‘కికు చిరంజీవి’. శుభ సాయి వెంకట్ దర్శకత్వంలో కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కికు ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దీప్తి నడిమింటి నిర్మించారు. ఈశ్వరీరావు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ భరత్ వైవా రాఘవ, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథ
చిరంజీవి (కికు యనమల) అనాథ వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్. అతనికి పుట్టుకతోనే హార్ట్ ఎడమవైపు కాకుండా కుడివైపు ఉండే అరుదైన వైద్య సమస్య ఉంటుంది. మరోవైపు, అనాథ అయిన మను (కశిష్ ఖాన్)ను శ్రీకాంత్ అయ్యంగార్ దత్తత తీసుకుని పెంచుతాడు. ఆమె వివాహం, పిల్లల దత్తత చుట్టూ కథ నడుస్తుంది. మను వివాహం నిశ్చయమైన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించడం, ఆ తర్వాత ఆమె ఫ్రెండ్స్‌తో కలిసి ఫారెస్ట్ ట్రిప్‌కి వెళ్లడం జరుగుతుంది. ఆ టూర్‌ని కవర్ చేయడానికి వెళ్లిన చిరంజీవితో మనుకి పరిచయం ఏర్పడుతుంది. ఫారెస్ట్ నుంచి తిరిగి వచ్చే క్రమంలో అసలు కథ మొదలవుతుంది. ఈశ్వరీరావు ఎంట్రీ, హీరోహీరోయిన్ల పెళ్లి, ఆ తర్వాత ఫస్ట్ నైట్ రోజు జరిగే భారీ ట్విస్ట్ కథను పూర్తిగా మార్చేస్తుంది. అసలు ఒక్క రాత్రిలో ఎడమవైపు ఉండాల్సిన గుండె కుడివైపు ఎలా కొట్టుకుంది? ఆ వెనుక ఉన్న రహస్యం ఏంటి? తనికెళ్ల భరణి పాత్ర నేపథ్యం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా.
విశ్లేషణ
ఇలాంటి డిఫరెంట్ మెడికల్ కాన్సెప్ట్‌తో సినిమాలు రావడం టాలీవుడ్‌కి కొత్తేమీ కాకపోయినా, దర్శకుడు శుభ సాయి వెంకట్ దీన్ని ఒక థ్రిల్లర్ జోనర్లో ప్రజెంట్ చేసే ప్రయత్నం చేయడం అభినందనీయం. సినిమా ప్రారంభంలో హీరోహీరోయిన్ల పరిచయం, ట్రిప్ సన్నివేశాలు కొంత నెమ్మదిగా సాగుతాయి. కొన్ని సీన్లు సాగదీతగా అనిపించినప్పటికీ, ఫారెస్ట్ ఎపిసోడ్ మరియు ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. తొలిభాగంలో డ్రామా మోతాదు కాస్త ఎక్కువైంది. ఇక సెకండాఫ్‌లో అసలు సినిమా కీలక మలుపు తిరుగుతుంది. పూర్తిగా సస్పెన్స్ మరియు థ్రిల్లర్ మోడ్‌లోకి వెళుతుంది. హీరోయిన్ పడే టెన్షన్, హీరో ప్రవర్తనలో వచ్చే మార్పులు ప్రేక్షకులను సీట్లలో కదలకుండా కూర్చోబెడతాయి. ట్విస్ట్‌లు ఒక్కొక్కటిగా రివీల్ అవుతుంటే సినిమా వేగం పుంజుకుంటుంది. క్లైమాక్స్ ఎమోషనలంగా ముగుస్తుంది.
నటీనటుల ప్రతిభ
హీరోగా తొలి సినిమా అయినప్పటికీ కికు యనమల తన పాత్రలో వైవిధ్యం చూపించి ఆకట్టుకున్నాడు. డిఫరెంట్ షేడ్స్‌లో ఆయన నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. హీరోయిన్గా కశిష్ ఖాన్ పర్వాలేనిపించింది. అయితే కొన్ని సన్నివేశాల్లో ఆమె హావభావాలు ఓవర్‌గా అనిపించినా, కథకు తగ్గట్లుగా నటించింది. కీలక పాత్రలో కనిపించిన ఈశ్వరీరావు తన అనుభవంతో సినిమాకు వన్నె తెచ్చారు. ఆమె పాత్ర చుట్టూ తిరిగే ఎమోషన్స్ బాగున్నాయి. శ్రీకాంత్ అయ్యంగార్, తనికెళ్ల భరణి, వైవా రాఘవ, గోపరాజు రమణ తమ పరిధి మేరకు నందిక కనబరిచి నవ్వించారు మరియు మెప్పించారు.
సాంకేతిక విభాగం
రామకృష్ణ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. అడవి మరియు బీచ్ విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. శేఖర్ చంద్ర అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) సస్పెన్స్ సీన్లలో హైలైట్‌గా నిలిచింది. ఎడిటింగ్ పరంగా ఫస్టాఫ్‌లో మరికొన్ని కత్తెరలు వేయాల్సి ఉంది. నిర్మాణ విలువలు చిన్న సినిమా స్థాయికి మించి చాలా రిచ్‌గా ఉన్నాయి. దీప్తి నడిమింటి ప్రొడక్షన్ పరంగా ఎక్కడా రాజీ పడలేదు. దర్శకుడు శుభ సాయి వెంకట్ ఎంచుకున్న పాయింట్ బాగుంది. ఎగ్జిక్యూషన్లో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, సెకండాఫ్‌ను డీల్ చేసిన తీరు సినిమాను నిలబెట్టింది. చివరిగా కొత్తదనం కోరుకునేవారికి, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ వారం ఈ చిత్రం ఒక మంచి ఆప్షన్ అవుతుంది.
రేటింగ్ 2.75/5