KGF3 | సినిమాలోని హైలైట్స్‌తో ట్రైలర్స్ కట్ చేస్తుంటారు. కానీ ఓ సినిమా మొత్తం ట్రైలర్‌లా ఉంటే అదే ‘కేజీఎఫ్’. ‘కేజీఎఫ్’ రెండు చిత్రాలు హీరోయిజానికి బెంచ్ మార్క్ క్రియేట్ చేశాయి. దీంతో ప్రశాంత్ నీల్ సినీ ప్రియులతో పాటు దేశవ్యాప్తంగా స్టార్ హీరోలకు ఫేవరేట్ డైరెక్టర్ అయిపోయాడు. హీరో యష్‌ను పాన్ ఇండియా స్టార్‌ను చేసిందీ సినిమా. ‘కేజీఎఫ్ 2’ గతేడాది ఏప్రిల్ 14న విడుదలైంది.
ఈ సినిమా రిలీజైన ఏడాది సందర్భంగా నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ‘రీవిజింట్ రాకీస్ ఎంపైర్’ అంటూ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో ‘కేజీఎఫ్’ రెండు చిత్రాల్లో రాకీ భాయ్ సాగించిన ప్రయాణాన్ని చూపించారు. అతను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు అని చివరలో ‘కేజీఎఫ్ ఛాప్టర్ 3’కి హింట్ ఇస్తూ 3 అంకెను చూపించారు. ఈ సినిమా ఏడాది పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో సినీ ప్రియులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.