కీరవాణి తనయుడు, సంగీత దర్శకుడు కాలభైరవ, కథానాయిక కావ్య కల్యాణ్‌రామ్ జోడీ త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారు. తామిద్దరం రిలేషన్షిప్లో ఉన్నట్లు ఈ జంట ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ‘మేమిద్దరం జీవితాంతం తోడుగా ఉంటామనే విషయాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. ఇక జీవితాంతం మనిద్దరం ఒకరికొకరం’ అని కాలభైరవ తన ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘నా జీవితంలో నువ్వు వెలుగుని నింపావు.
ఈ ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతురాలైన అమ్మాయి నేనే అనే నమ్మకాన్ని కలిగించినందుకు ధన్యవాదాలు’ అంటూ కావ్య కల్యాణ్‌రామ్ తన పోస్ట్‌లో ఆనందం వ్యక్తం చేసింది. బాలనటిగా కెరీర్ మొదలుపెట్టిన కావ్య కల్యాణ్‌రామ్.. మసూద, బలగం వంటి చిత్రాలతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక కాలభైరవ తన తండ్రి బాటలోనే సంగీత దర్శకుడిగా రాణిస్తున్నారు. కొద్దికాలంగా వస్తున్న వార్తల్ని నిజం చేస్తూ ఈ జంట తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించారు.