Impure Movie | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త ప్రయోగానికి తెరలేచింది. టెక్ రంగంలో స్థిరపడినా, సినిమాపై ఉన్న అంతులేని మక్కువతో వారాహి మల్లిపాముల ‘ఇంప్యూర్’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంతో ఆమె ఏకంగా నిర్మాతగా, నటిగా, రచయిత్రిగా పరిశ్రమలోకి అరంగేట్రం చేస్తుండటం విశేషం.
కాకినాడలో జన్మించి పెన్సిల్వేనియాలో పెరిగిన వారాహి.. పెన్ స్టేట్ నుండి ఇంజనీరింగ్, జర్నలిజంలో డబుల్ మేజర్ పూర్తి చేశారు. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, లండన్ వంటి నగరాల్లో టెక్ రంగంలో ఉద్యోగం చేస్తూనే, ఆరు సంవత్సరాల పాటు పగలు ఉద్యోగం, రాత్రులు/వీకెండ్స్‌లో స్క్రిప్ట్ వర్క్ చేస్తూ ఈ సినిమాను సాకారం చేసుకున్నారు.
‘మా ఇంటి బంగారం’ చిత్రానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన నిశాంతి ఎవాని ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఒక మహిళ పెళ్లికి ముందే కన్య కాదనే నిజాన్ని అత్తమామలు తెలుసుకుని పెళ్లి రద్దు చేసే సున్నితమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు సినిమాల్లో సాధారణంగా ఉత్తర భారత నటీమణులను తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్నప్పటికీ, ఈ చిత్రంలో పూర్తి తెలుగు అమ్మాయి యషా ముత్తులూరిని ప్రధాన పాత్రలో ఎంపిక చేసి ప్రత్యేకత చాటుకున్నారు.
సినిమా ప్రయాణంపై వారాహి మాటల్లో..
“సినిమా ప్రయత్నాలలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. మా చెల్లి పెళ్లికి పెట్టిన ఖర్చులో కొంత మొత్తాన్ని మా అమ్మ నాకు సినిమా కోసం ఇచ్చారు. ఆ డబ్బు సరిపోకపోవడంతో మరింత అప్పు చేసి, న్యూయార్క్ నుండి వచ్చి ఈ సినిమాను పూర్తి చేశాను. మహిళా ప్రాధాన్య చిత్రాలకు నిర్మాతలను ఒప్పించడం చాలా కష్టం. అయితే, సమంత మరియు నందిని రెడ్డి గార్లు ఇచ్చిన స్ఫూర్తితోనే ఈ చిత్రాన్ని నేనే స్వయంగా థియేటర్లలో పంపిణీ చేస్తున్నాను. రాజా కుమారి, కరణ్ పాండవ్ వంటి గ్రామీ నామినేటెడ్ కళాకారులు మా సినిమాకు పాటలు స్వరపరిచారు. జ్ఞానశేఖర్ వి.ఎస్ సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచింది. రక్తపాతంతో కూడిన సినిమాల మధ్య మా ఈ ఇండిపెండెంట్ చిత్రం సరికొత్త దృక్కోణాన్ని అందిస్తుంది” అని వారాహి తెలిపారు. ఇప్పటికే లాస్ ఏంజిల్స్‌లోని టిసిఎల్ చైనీస్ థియేటర్, న్యూయార్క్‌లోని సినిమా విలేజ్‌లో ఈ సినిమా ప్రీమియర్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. అక్టోబర్ 2న పాన్-ఇండియా వ్యాప్తంగా పరిమిత థియేటర్లలో ‘ఇంప్యూర్’ గ్రాండ్‌గా విడుదలవుతోంది.