Oscars | సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ఆస్కార్ (Oscar Awards) తొలిస్థానంలో ఉంటుంది. ఈ అవార్డును జీవితంలో ఒక్కసారైనా తాకాలని ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్లు ఆశ పడుతుంటారు. ఇక 96వ ఆస్కార్ వేడుకలు లాస్ ఏంజిల్స్‌లోని డాల్బి థియేటర్లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్తమ సహాయ నటుడి నుంచి మొదలై బెస్ట్ మూవీ అవార్డుతో వేడుక ముగిసింది. అయితే ప్రపంచ సినీరంగంలో అత్యుత్తమ అవార్డు అయిన ఆస్కార్ అసలు ఎప్పుడు మొదలైంది? తొలి ఆస్కార్ విజేత ఎవరు? అనే పలు విషయాల గురించి తెలుసుకుందాం..
‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ అందించే ట్రోఫీని మొదట ‘అకాడమీ అవార్డు ఆఫ్ మెరిట్’గా పిలిచేవారు. తర్వాత ఇది ఆస్కార్గా మారింది. ఇలా ఆస్కార్గా మారాడం వెనుక ఓ కథ ఉంది. అవార్డు తొలినాళ్లలో అకాడమీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన మార్గరెట్ హెర్రిక్.. ఆ ట్రోఫీ అచ్చం తన అంకుల్ ఆస్కార్‌లా కనిపిస్తుందని చెప్పారట. ఆ తర్వాత ఓ హాలీవుడ్ జర్నలిస్ట్ తన వ్యాసంలో అకాడమీ అవార్డును ఆస్కార్గా పేర్కొన్నాడట. దాంతో అప్పటి నుంచి దీన్ని ఆస్కార్గా పిలుస్తున్నారు.
ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం తొలిసారి 1929లో ది హాలీవుడ్ రూజ్వెల్ట్ హోటల్లో జరిగింది. 1927, 1928 సంవత్సరాలలో సినిమా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం కోసం డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, విలియం డెమిలీ కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. తొలిసారి జరిగిన ఈ వేడుకకు 270పైగా గెస్ట్‌లు వచ్చారు. కాగా అప్పుడు 15 మంది ఆస్కార్ అవార్డును అందుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 3,140 ఆస్కార్ అవార్డులు ప్రధానం చేయబడ్డాయి. తొలినాళ్లలో ఆస్కార్ అవార్డుల వేడుక రేడియో ద్వారా ప్రసారం అయింది.
ఆస్కార్ అవార్డు పసిడి వర్ణంతో.. ఓ యోధుడు రెండు చేతులతో వీర ఖడ్గం చేతపట్టి ఫిల్మ్ రీలుపై ఠీవీగా నిలబడినట్లు కనిపిస్తోంది. దీనిని ఎంజీఎం స్టూడియో ఆర్ట్ డైరెక్టర్ కెడ్రిక్ గిబ్బన్స్ (Cedric Gibbons) సృష్టించారు. ఆస్కార్ ప్రతిమ కింది భాగంలోని రీలు చుట్టులో 5 చువ్వలుంటాయి. అకాడమీలోని 5 విభాగాలకు అవి సూచికలు. ఎమిలో ఫెర్నాండెజ్ అనే నటుడిని నగ్నంగా నిలబెట్టి అతడి ఆకారం నుంచి స్ఫూర్తిపొంది.. గిబ్బన్స్ ఈ ప్రతిమను రూపొందించారట. అందుకే ఆస్కార్ ప్రతిమ నగ్నంగా కనిపిస్తుంది. దీనిని లాస్ ఏంజిల్స్ కు చెందిన ప్రసిద్ధ శిల్ప జార్జ్ స్టాన్లీ తయారు చేశారు.
చూసేందుకు బంగారు షీల్డ్‌గా కనిపించే ఆ ప్రతిమ.. నిజానికి బంగారం కాదు. దానిని కాంస్యంతో తయారుచేస్తారు. అనంతరం 24 క్యారెట్ల బంగారు పూత అద్దుతారు. దాని ఎత్తు 13.5 అంగుళాలు. 450 గ్రాముల పైగా (8.5 పౌండ్ల) బరువు ఉంటుంది. ఒక్కో ఆస్కార్ తయారీకి సుమారు 1000 డాలర్లకుపైగా ఖర్చవుతుంది. అయితే ఈ అవార్డ్ విలువ ఒక డాలర్ మాత్రమే. అంటే దానిని అమ్మితే కేవలం ఒక డాలర్ మాత్రమే వస్తుందట. కానీ వాటిని అమ్మకూడదనే నిబంధన ఉంది.
ఉత్తమ నటుడిగా మొదటి ఆస్కార్ అవార్డును ఎమిల్ జెన్నింగ్స్ అందుకున్నాడు. 1928లో వచ్చిన ‘ది లాస్ట్ కమాండ్’ అనే సినిమాకు ఈ అవార్డును గెలుచుకున్నాడు.
ఉత్తమ నటిగా తొలి అవార్డు జనేట్ గేనోర్ గెలుచుకుంది. 1927లో విడుదలైన ‘సెవెన్త్ హెవన్’ సినిమాలోని ఆమె నటనకు ఆస్కార్ వరించింది.
ఆస్కార్ అందుకున్న తొలి లేడి డైరెక్టర్‌గా కేథరిన్ బిగ్లో నిలిచింది. 2010లో ‘ది హర్ట్ లాకర్’ అనే సినిమాకు కేథరిన్ అస్కార్‌ను గెలిచుకుంది. అత్యధికంగా ఆస్కార్ నామినేషన్లు అందకున్న వ్యక్తిగా వాల్ట్ డిస్నీ నిలిచాడు. ఆయన మొత్తం 59 నామినేషన్లు అందుకుంటే 25 అవార్డులను గెలుచుకున్నారు. నటి మెరిట్ స్ట్రీప్ అత్యధికంగా నామినేషన్లు దక్కించుకున్న మహిళగా నిలిచింది. 21 నామినేషన్లు దక్కించుకున్న ఆమె 3 సార్లు అవార్డు గెలుచుకుంది.
అతి చిన్న వయసులో ఆస్కార్ అందుకున్న నటిగా టేటమ్ ఒ నీల్ రికార్డు క్రియేట్ చేసింది. 1973లో వచ్చిన ‘పేపర్ మూన్’ అనే సినిమాకు ఉత్తమ సహాయనటిగా టోటమ్ ఆస్కార్‌ను గెలుచుకుంది. అప్పుడు ఆమె వయసు పదేళ్లు మాత్రమే. ఇక అతి పెద్ద వయసులో ఆస్కార్ అందుకున్న నటుడిగా ఆంథోని హాస్కిమ్స్ మరో రికార్డును క్రియేట్ చేశాడు. 2020లో వచ్చిన ‘ది ఫాదర్’ అనే సినిమాను ఉత్తమ నటుడిగా ఆంథోని ఆస్కార్‌ను అందుకున్నాడు. ఆ అవార్డు అందుకున్నప్పుడు ఆయనకు 83ఏళ్లు.
అత్యధికంగా 11 విభాగాల్లో అవార్డులు దక్కించుని ‘బెన్-హర్’, ‘టైటానిక్’, ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ సినిమాలు చరిత్ర సృష్టించాయి. బెస్ట్ పిక్చర్‌గా ఆస్కార్ పురస్కారం గెలుచుకున్న ఒకే ఒక అడల్ట్ సినిమా ‘మిడ్నైట్ కౌబాయ్’.