దర్శకుడు అమ్మ రాజశేఖర్ రూపొందించిన సినిమా ‘హైయ్ ఫైవ్’. ‘ఫన్ అండ్ గన్’ అనేది ఉపశీర్షిక. కొత్త నటీనటులు నటిస్తున్న ఈ సినిమాకు రాధా రాజశేఖర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నది. థమన్ సంగీత దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 22న విడుదలకాబోతున్నది. తాజాగా చిత్ర ప్రీరిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవిత రాజశేఖర్, దర్శకులు ఏఎస్ రవికుమార్, సూర్య కిరణ్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ…‘ఇదొక కొత్త తరహా సినిమా. ఆద్యంతం ఆస్వాదించేలా ఉంటుంది.
ఈ కార్యక్రమానికి అతిథిగా రావాలని హీరో నితిన్‌కు పది రోజుల కిందటే చెప్పాను. వస్తా అన్నాడు. తీరా మేమంతా సిద్ధమయ్యాక రాకుండా మమ్మల్ని అవమానించాడు. అతనికి డ్యాన్సులు రాని రోజుల్లో నేనే నేర్పించాను. గురువును మర్చిపోయిన వారు ఎదగరు’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు శివారెడ్డి, విశ్వ, బిగ్ బాస్ దివి తదితరులు పాల్గొన్నారు.