Sayaji Shinde | టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయాజీ షిండే (Sayaji Shinde) ఆసుపత్రిలో చేరారు. ఛాతీలో తీవ్రమైన నొప్పి (chest pain) రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని గురువారం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు గుండెలో కొన్ని బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆయనకు యాంజియోప్లాస్టీ చేశారు. సాయాజీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర సతారా (Satara)లోని ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిసింది.
సాయాజీ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. రొటీన్ చెకప్‌లో భాగంగా ఇటీవలే పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. అప్పుడు ఈసీజీలో స్వల్ప మార్పులు గుర్తించామని, గుండెలో కుడివైపు సిరలు 99 శాతం మేర పూర్తిగా మూసుకుపోయినట్లు గుర్తించామన్నారు. దీంతో వెంటనే ఆయనకి యాంజియోప్లాస్టీ చేసినట్లు వివరించారు. శస్త్రచికిత్స విజయవంతమైందని ప్రస్తుతానికి నటుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. త్వరలోనే డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు వెల్లడించారు.
మహారాష్ట్రకు చెందిన సాయాజీ షిండే మరాఠీ-హిందీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు. అతను కన్నడ, తమిళం, మలయాళంతోపాటు తెలుగు చిత్రాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో ఠాగూర్, గుడుంబా శంకర్, ఆంధ్రుడు, సూపర్, అతడు, లక్ష్మి, రాఖీ, ఆట, పోకిరి, దుబాయ్ శీను, ఆర్య 2, అరుంధతి, మిస్టర్ ఫర్ఫెక్ట్, దూకుడు, బిజినెస్మెన్ తదితర చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
Also Read..
PM Modi | జమ్మూ కశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
Stealing Shoes | ఫుడ్ డెలివరీ బాయ్ చేతివాటం.. ఇంటి ముందు ఉంచిన ఖరీదైన షూ చోరీ.. VIDEO
AAP | ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ ప్రయత్నం : ఢిల్లీ మంత్రి అతిశీ