Dacoit Movie | టాలెంటెడ్ హీరో అడివి శేష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన క్రేజీ ప్రాజెక్ట్ ‘డెకాయిట్’ (Dacoit). ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. తాజాగా ముంబైలో జరిగిన ఈ సినిమా హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చిత్రబృందం చేసిన ఒక వినూత్న ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సాధారణంగా సినిమా ఈవెంట్లకు హీరో హీరోయిన్లు ఎంతో స్టైలిష్‌గా కార్లలో దిగుతారు. కానీ, ‘డెకాయిట్’ టీమ్ మాత్రం ట్రెండ్‌కు భిన్నంగా ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్‌కు హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌తో పాటు హీరో అడివి శేష్‌లను ఒక పోలీస్ వ్యాన్‌లో, చేతులకు సంకెళ్లు (Handcuffs) వేసి తీసుకువచ్చారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంలో పోలీస్ పాత్రలో నటిస్తుండగా అతడే మృణాల్‌ని సంకెళ్లతో వ్యాన్ దింపి ఈవెంట్ వేదికపైకి నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. మొదట ఇది చూసిన మీడియా ప్రతినిధులు, అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే సినిమా కథాంశం నేర ప్రపంచం, రివెంజ్ డ్రామా చుట్టూ తిరుగుతుండటంతో.. మూవీ థీమ్‌కు తగ్గట్టుగానే ఈ వెరైటీ పబ్లిసిటీ స్టంట్‌ను ప్లాన్ చేశారని తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు.