‘90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్‌సిరీస్ ద్వారా దర్శకుడిగా పరిచయమై ట్రెమండస్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ ఆదిత్య హాసన్. ‘లిటిల్‌హార్ట్స్’ సినిమాతో నిర్మాతగా అభిరుచిని చాటుకున్న ఆయన.. ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమాతో దర్శకుడిగా తొలిసారి వెండితెరపై అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఈ నెల 11న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా సోమవారం విలేకరులతో మాట్లాడారు ఆదిత్య హాసన్.
మాది వనపర్తి. టెన్త్ వరకూ అక్కడే చదువుకున్నా. నాన్న స్కూల్ టీచర్‌గా రిటైర్ అయ్యారు. అమ్మ హౌస్‌వైఫ్. హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తి చేశాను. మాస్టర్స్ కోసం యూకే వెళ్లాను. నాకు సినిమాలంటే చిన్నప్పట్నుంచి ఇష్టం. అందుకే షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడ్ని. నా అసలు పేరు ఆదిత్య. కమల్‌హాసన్ అభిమానిని. అందుకే నా పేరును ఆదిత్య హాసన్‌గా మార్చుకున్నాను. యూకే నుంచి తిరిగి వచ్చాక సినిమా ప్రయాత్నాలు మొదలుపెట్టాను. మా నాన్న జీవితం ఆధారంగా నేను రాసుకున్న కథ ‘90s. ఆ సిరీస్ నాకు మంచి పేరు తెచ్చింది. దానికి సీక్వెలే రాబోతున్న ‘ఎపిక్’.
90s సిరీస్‌లోని తమ్ముడి పాత్రకు చెందిన జీవితంలోని భాగమే ‘ఎపిక్’ కథ.
నిజజీవిత సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా సాగుతుంది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా సినిమా ఉంటుంది. ఆ తర్వాత అన్న జీవితాన్ని ఓ కథగా, అక్క జీవితాన్ని ఓ కథగా చూపించే ఆలోచన కూడా ఉంది. ‘ఎపిక్’కు కొనసాగింపు కూడా ఉంటుంది. ‘ఎపిక్ – ఫైనల్ సెమిస్టర్’ పేరుతో ఆ కథ రాస్తున్నా. తొలిభాగంలో ముగింపు కొత్తగా ఉంటుంది. ‘బేబీ’ కాంబో కమర్షియల్‌గా హెల్ప్ అవుతుందని ఆనంద్‌ని, వైష్ణవిని తీసుకున్నాం. మేం అనుకున్నట్టే వారిద్దరి వల్ల సినిమాకు హైప్ వచ్చింది.
ఒక యువకుడు హైదరాబాద్ నుంచి యూకే వెళ్తాడు. అక్కడ ఒకమ్మాయితో ప్రేమలో పడతాడు. చివరికి వారిద్దరూ ఒకటయ్యారా? లేదా? అనేదే ఈ కథ. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల గురించి ఎక్కువ సినిమాలు రాలేదు. నేను అలా చదువుకున్న విద్యార్థినే కాబట్టి, అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలుసు. దాన్ని ప్రేక్షకులకు చెప్పాలనిపించి ‘ఎపిక్’ చేశాను. నాకు గోరటి వెంకన్న అంటే ఇష్టం. లండన్‌లో చదువుతున్నప్పుడు ఆయన పాటలు వినేవాడ్ని. నా తొలి సినిమాలో ఆయన పాట ఉండాలనుకున్నాను. అందుకే ‘ఎపిక్’లో ఆయనతో పాడించాను. ‘సంచారమే..’ పాటతోనే ప్రమోషన్స్ మొదలుపెట్టాం. అన్ని జానర్లలోనూ విలువలతో కూడిన సినిమాలు చేయడమే నా లక్ష్యం.