Dhanush | ప్రస్తుతం తమిళ హీరోలు తెలుగులో మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పలువురు స్టార్ హీరోలు తెలుగు దర్శకులతో చేతులు కలుపుతున్నారు. ముఖ్యంగా ధనుష్ వరుసగా టాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్’ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మహాశివరాత్రి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ పీరియడిక్ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే ధనుష్ తాజాగా మరో తెలుగు దర్శకుడుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
‘జిల్’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు రాధాకృష్ణ. ఈ సినిమా సక్సెస్‌తో ఏకంగా ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్’ సినిమాకు దర్శకత్వం వహించే చేసే చాన్స్ కొట్టేసాడు. అయితే ఆ అవకాశాన్ని రాధా కృష్ణ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మాస్ ఇమేజ్ ఉన్న ప్రభాస్‌ను లవర్ బాయ్‌లా చూపించి చేతులు కాల్చుకున్నాడు. రాధేశ్యామ్ తర్వాత ఇప్పటి వరకు ఈయన మరో సినిమా ప్రకటించలేదు. కాగా తాజాగా ధనుష్, రాధాకృష్ణకు చాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇటీవలే రాధాకృష్ణ చెప్పిన లైన్ నచ్చడంతో ధనుష్ వెంటనే కథను సిద్ధం చేయమని చెప్పాడట. ఇక ఆల్మోస్ట్ ఈ కాంబో సెట్ అయిందన్న వార్తలు నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.