Dacoit | ట్రెండ్‌తో సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్. ఆయన తాజాగా నటించిన యాక్షన్ లవ్ స్టోరీ ‘డెకాయిట్’. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంతో సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో దర్శకుడిగా పరిచయమయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ
ఈ సినిమా కథ కరోనా నేపథ్యంలో సాగుతుంది. చేయని నేరానికి జైలు శిక్ష అనుభవిస్తుంటాడు హరిదాస్ (అడివి శేష్). తాను ప్రాణంగా ప్రేమించిన సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాల్ ఠాకూర్) చెప్పిన అబద్ధపు సాక్ష్యం కారణంగానే హరి జైలు పాలవుతాడు. పదమూడేళ్ల తర్వాత జైలు నుంచి తప్పించుకున్న హరి, తనను మోసం చేసిన ప్రేయసిపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. కానీ, బయటకు వచ్చాక ఆమె ఆర్థిక కష్టాలు, అనారోగ్యంతో ఉన్న భర్త, పసిబిడ్డ కోసం ఆమె పడుతున్న తపన చూసి హరి చలించిపోతాడు. అదే సమయంలో డబ్బు కోసం ఒక భారీ ఆసుపత్రిలో దొంగతనం చేసేందుకు వీరిద్దరూ ఒక డీల్ కుదుర్చుకుంటారు. అసలు సరస్వతి హరిని ఎందుకు జైలుకు పంపింది? ఈ దొంగతనం ప్రయత్నంలో వారికి ఎదురైన సవాళ్లు ఏంటి? వీరి ప్రేమ కథ ఏ తీరానికి చేరింది? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ
దర్శకుడు షానైల్ డియో టీజర్ లోనే ‘కన్నె పెట్టెరో’ సాంగ్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. ట్రైలర్లో కథను ముందే రివీల్ చేసినప్పటికీ, వెండితెరపై ఆ కథను ప్రెజెంట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. జైలు నుంచి తప్పించుకున్న హీరో, తనను జైలు పాలు చేసిన మాజీ ప్రేమికురాలిపై పగ తీర్చుకోవాలని వస్తాడు. కానీ, అక్కడ ఆమె పరిస్థితులు చూసి తన పగను పక్కన పెట్టి, ఆమె కోసం ఒక భారీ దోపిడీకి (Dacoit) సిద్ధపడతాడు. ఈ క్రమంలో ఎదురయ్యే మలుపులే ఈ సినిమా. సినిమా ఓపెనింగ్ నుంచే ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా వేగంగా, ఊహించని సన్నివేశాలతో సాగుతుంది. శేష్ సినిమాల్లో ఆశించే ట్విస్టులు ఇక్కడ కూడా పుష్కలంగా ఉన్నాయి. కథ కొంత రొటీన్ గా అనిపించినా, స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో టీం ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలిగింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండ్ హాఫ్ మీద ఆసక్తిని పెంచేలా డిజైన్ చేశారు.
ద్వితీయార్థం మొదలయ్యాక కథలోని అసలు ట్విస్టులు రివీల్ అవుతాయి. హీరోయిన్ మీద పగతో ఉన్న హీరో యాంగిల్ నుంచి, ఆమె కోసం ప్రాణాలకు తెగించే స్థాయికి వెళ్లే క్లైమాక్స్ వరకు కథనం ఎమోషనల్ గా సాగుతుంది. సెకండ్ హాఫ్ అక్కడక్కడా కాస్త స్లో అయినట్లు అనిపించినా, క్లైమాక్స్ సీక్వెన్స్ మాత్రం ప్రతి ప్రేక్షకుడి కంటతడి పెట్టిస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ఎమోషనల్ బాండింగ్ సినిమాకు ప్రాణంగా నిలిచింది.
సాంకేతికంగా
దర్శకుడు షానీల్ డియో రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా ఈ కథను తెరకెక్కించారు. స్క్రీన్ ప్లే, టేకింగ్‌లో ఫ్రెష్‌నెస్ కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ & ఎడిటింగ్ విజువల్స్ టాప్ నాచ్గా ఉన్నాయి. ఎడిటర్ పనితీరు సినిమా వేగాన్ని కాపాడింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్‌ను ఎలివేట్ చేసింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో మ్యూజిక్ అదరగొట్టింది. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
నటీనటుల ప్రతిభ
అడివి శేష్ తన గత సినిమాల కంటే భిన్నంగా ఈసారి మాస్ లుక్‌లో కనిపించి మెప్పించారు. ముఖ్యంగా రాయలసీమ యాసలో ఆయన చెప్పిన డైలాగులు, మ్యానరిజమ్స్ ఆకట్టుకున్నాయి. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయింది. శేష్-మృణాల్ మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కామాక్షి భాస్కర్ల చిన్న పాత్రలోనూ ప్రభావం చూపగా, ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్, సునీల్ తమ పరిధి మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్:
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటన
సాంకేతిక విలువలు (సంగీతం, సినిమాటోగ్రఫీ)
క్లైమాక్స్ సీక్వెన్స్
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడా మిస్ అయిన లాజిక్స్
స్క్రీన్ ప్లేలో మరికొంత జాగ్రత్త తీసుకోవాల్సింది
ముగింపు: పగ, ప్రతీకారం మరియు లోతైన భావోద్వేగాలతో సాగే ‘డెకాయిట్’, ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే ఈ చిత్రాన్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేయవచ్చు.
రేటింగ్ : 3/5