హీరో చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘గాడ్ ఫాదర్’. రాజకీయ నేపథ్య కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార నాయికగా నటిస్తుండగా..బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో సత్యదేవ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రబృందంలో తాజాగా చేరారు ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా. చిరంజీవి సల్మాన్ ఖాన్ల మీద చిత్రీకరించే పాటలో మాస్ స్టెప్పులు చేయించనున్నారాయన. ఈ విషయాన్ని మంగళవారం చిత్రబృందం వెల్లడించింది. ప్రభుదేవా, చిరంజీవి, మోహన్ రాజాతో కలిసి తాను దిగిన ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేసిన థమన్..‘చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి డ్యాన్సులు చేయడం అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని స్పందించారు. ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.