Bumrah | పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను సృష్టిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, సంగీతాన్ని ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చాయి. సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండటంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల భోపాల్‌లో జరిగిన మ్యూజిక్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. అయితే ఈ ఈవెంట్లో జరిగిన ఒక చిన్న పొరపాటు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
ఈవెంట్లో హోస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ రామ్ చరణ్ భారత స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాను పొరపాటున “ఫుట్‌బాల్ ప్లేయర్”గా సంబోధించారు. ఈ కామెంట్స్ క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పలువురు నెటిజన్లు, మీమ్ క్రియేటర్లు చరణ్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. అయితే తన తప్పును వెంటనే గుర్తించిన రామ్ చరణ్ అదే వేదికపై స్పందించారు. తాను కొన్నిసార్లు పేర్లు మర్చిపోతానని, అది ఒక సాధారణ మానవ తప్పిదమని తెలిపారు. అలాగే బుమ్రా అంటే తనకు చాలా ఇష్టమని చెబుతూ క్షమాపణలు కూడా చెప్పారు. ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో మరో విషయం వైరల్‌గా మారింది. రామ్ చరణ్ ఫోటోతో పాటు “నో ప్రాబ్లం యశ్ భాయ్.. నేను మీకు పెద్ద ఫ్యాన్‌ని.. మీ ‘టాక్సిక్’ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను” అనే కామెంట్‌తో ఒక పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
దీనిని చాలామంది జస్ప్రీత్ బుమ్రానే షేర్ చేశారని ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందులో నిజం లేదని తెలుస్తోంది. ఇది అభిమానులు, మీమ్ పేజీలు క్రియేట్ చేసిన ఎడిటెడ్ పోస్ట్ మాత్రమే. బుమ్రా అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఇలాంటి పోస్ట్ ఎక్కడా కనిపించలేదు. అయినా సరే ఈ మీమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇక ‘పెద్ది’ సినిమా విషయానికి వస్తే, ఇది గ్రామీణ క్రీడల నేపథ్యంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే సినిమా ప్రచార కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.