Dangal Actress | బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ (Aamir Khan) నటించిన ‘దంగల్’ (Dangal) చిత్రంలోని బాలనటి సుహానీ భట్నాగర్(19) ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం కాలికి గాయమవ్వడంతో దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు సుహానీ. అయితే ట్రీట్మెంట్లో భాగంగా వాడిన మందులు రియాక్షన్ వల్ల సైడ్ఎఫెక్ట్స్ వచ్చి చికిత్స పొందుతూ గత శనివారం ప్రాణాలు విడిచింది. ఇక సుహానీ మరణ వార్తతో చిత్ర పరిశ్రమలో విషాద చాయలు అలముకున్నాయి. పలువురు నటులు సోషల్ మీడియా ద్వారా సుహానీ మృతికి సంతాపం తెలిపారు.
ఇదిలావుంటే సుహానీ మరణవార్త విన్న అమీర్ ఖాన్ (Aamir Khan) సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఫరీదాబాద్‌లోని ఆమె ఇంటికి వెళ్లిన అమీర్ ఖాన్ సుహానీ చిత్రపటానికి నివాళులు అర్పించాడు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.