Sonal Chauhan | బంజారాహిల్స్ : హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్దిని చూస్తుంటే తనతో పాటు బాలీవుడ్‌కు చెందిన అనేకమంది నటీనటులకు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనే అభిప్రాయం కలుగుతోందని బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ అన్నారు. టాలీవుడ్ వర్థమాన హీరో అభినవ్ సర్ధార్ ఆధ్వర్యంలో శ్రీశైలం హైవేలోని కడ్తాల్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న సర్దార్ క్షేత్ర డెవలపర్స్ లగ్జరీ విల్లాస్‌కు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం జూబ్లీహిల్స్‌లో నిర్వహించారు.
ఈ సందర్బంగా సినీనటి సోనాల్ చౌహాన్ మాట్లాడుతూ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి జూబ్లీహిల్స్‌కు కారులో వస్తుంటే విదేశాల్లో ఉన్న ఫీలింగ్ కలిగిందని తెలిపింది. దేశంలోని ఏ నగరంలో కూడా ఇంత భారీ భవనాలు కనిపించలేదని ఆమె పేర్కొన్నారు. ఇక్కడి నిర్మాణాలను చూస్తుంటే తనకు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన వస్తోందని అన్నారు. అనేక అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నాయని తనకు తెలిసిందని, ఇలాంటి తరుణంలో సినీ పరిశ్రమకు చెందిన యువ నటుడు నిర్మాణరంగంలోకి ప్రవేశించడం మంచి పరిణామమన్నారు.