Bhagyanagaramloo Saradhi Prema | పెద్ద నిర్మాణ సంస్థలు, స్టార్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా.. పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే అద్భుతమైన సినిమాలు తెరకెక్కించవచ్చని ‘భాగ్యనగరంలో సారథి ప్రేమ’ చిత్రం మరోసారి నిరూపించింది. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువ దర్శకుడు రంగుభుక్త రాము తన సినీ కలను నిజం చేసుకునేందుకు దాదాపు ఏడాదిన్నర పాటు శ్రమించి ఈ చిత్రాన్ని రూపొందించారు. నిర్మాతలు అంగా రెడ్డి భరత్ రెడ్డి, వాల్దాస్ భరత్ గౌడ్ కూడా పరిశ్రమకు కొత్తవారే అయినప్పటికీ.. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ నిర్మాతలు, రాబోయే ఐదు నుండి పది సంవత్సరాలలో మరెన్నో మంచి చిత్రాలను నిర్మించడమే తమ ధ్యేయమని ప్రకటించారు.
ఈ చిత్రంలో ప్రిన్స్ వంశీ, నిక్కీ చారి ప్రధాన పాత్రల్లో నటించగా, ప్రత్యేక పాత్రలో ఐవీడీ సాయి కనిపించారు. నితిన్, చోటు, వినయ్, రాజా, హరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కథకు తగ్గట్టుగా ప్రతి నటుడు తన పాత్రకు పూర్తి న్యాయం చేయడంతో సినిమా ఎంతో సహజంగా అనిపిస్తుంది. ఈ సినిమాకు రామయ్య చెంబోలు కథను అందించగా, శ్రావణ్ కుప్పిలి సంభాషణలు రాస్తూనే అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించారు. సంగీత దర్శకుడు సంపత్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. పవన్ కొంబత్తుల రాసిన సాహిత్యం కూడా శ్రోతలను ఆకట్టుకుంటుంది. ప్రవీణ్ కోమటి సినిమాటోగ్రఫీ, భాను అసిస్టెంట్ డీవోపీగా చేసిన పనితీరు, గీవన్ జీఆర్ ఎడిటింగ్ సినిమాకు మంచి సాంకేతిక నాణ్యతను తీసుకొచ్చాయి.
హైదరాబాద్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కేవలం 10 రోజుల్లోనే 1 గంట 10 నిమిషాల నిడివి గల ఈ చిత్రాన్ని పూర్తి చేయడం ఒక విశేషం. సినిమా అవుట్‌పుట్‌పై ఉన్న నమ్మకంతో ఇటీవల ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించగా, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అదే ఉత్సాహంతో ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు ఆనంద్ దేవరకొండ చేతుల మీదుగా యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో ‘భాగ్యనగరంలో సారథి ప్రేమ’ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. యువత భావోద్వేగాలు, ప్రేమ, స్నేహం, జీవిత పోరాటాలను హృదయానికి హత్తుకునేలా ఈ సినిమాలో చూపించారు. కొత్తవారి ప్రతిభను, కష్టాన్ని ప్రోత్సహించాలనుకునే ప్రతి సినీ అభిమాని తప్పకుండా చూడాల్సిన చిత్రమిది.