Bala Krishna | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్లో ఫుల్ జోష్‌లో దూసుకెళ్తున్నారు. వరుస విజయాలతో మళ్లీ తన మార్క్ మాస్ ఇమేజ్ను పీక్‌కి తీసుకెళ్లిన బాలయ్య.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలతో అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి తన 111వ చిత్రం ‘NBK111’ను ప్రారంభించిన బాలకృష్ణ, ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య తన కెరీర్‌లోని 112వ సినిమాను చేయబోతున్నారు. ఈ ప్రకటన బయటకు వచ్చిన దగ్గర నుంచే టాలీవుడ్లో భారీ చర్చ మొదలైంది.
మాస్ హీరో బాలకృష్ణకు కొరటాల శివలాంటి కమర్షియల్ డైరెక్టర్ జతకావడంతో ఈ సినిమా ఎలాంటి స్థాయిలో ఉండబోతుందా అనే ఆసక్తి అభిమానుల్లో రోజురోజుకూ పెరుగుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన కథ, బాలయ్య పాత్ర, బ్యాక్‌డ్రాప్ వంటి విషయాలపై ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొరటాల శివ తన గత చిత్రాల మాదిరిగానే బలమైన సామాజిక అంశంతో పాటు భారీ మాస్ ఎలిమెంట్స్‌ను ఈ సినిమాలో చూపించబోతున్నాడని టాక్. బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగానే పవర్ఫుల్ డైలాగ్స్, ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాలతో ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. బాలయ్య సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు సినీ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తున్నాయి. గతంలో బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్ బయోపిక్’లో విద్యా బాలన్ ఆయన భార్య బసవతారకం పాత్రలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఆ సినిమాలో బాలయ్య-విద్యా బాలన్ కాంబినేషన్ చాలా కొత్తగా, సహజంగా అనిపించింది.దీంతో ఇప్పుడు మరోసారి ఈ జోడీని తెరపై చూపించాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కేవలం గ్లామర్ కాకుండా కథలో కీలకమైన ప్రాధాన్యత ఉంటుందట. అందుకే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర కోసం విద్యా బాలన్‌ను సంప్రదిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కొరటాల శివ సినిమాల్లో మహిళా పాత్రలకు ప్రత్యేక స్థానం ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యా బాలన్ లాంటి నటిని తీసుకుంటే సినిమాకు మరింత బలం చేకూరుతుందని భావిస్తున్నారట.