సమాజంలో అన్యాయం జరుగుతున్నప్పుడు ఎవరో వచ్చి మనల్ని కాపాడుతారని ఎదురుచూడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఏం చేయాలి? ఆడపిల్లల్లో ఎలా ధైర్యాన్ని నింపాలి? అనే అంశాలను చర్చిస్తూ ‘బ్లాస్ట్జోన్’ సినిమా తెరకెక్కిందని చెప్పారు యాక్షన్ కింగ్ అర్జున్. ఆయన ప్రధాన పాత్రలో ప్రీతి ముకుందన్, అభిరామి కీలక పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘బ్లాస్ట్జోన్’ అదే పేరుతో ఈ నెల 28న తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. సుభాష్ కె రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ విడుదల చేస్తున్నది.
సోమవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్జున్ మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. సమాజంలో ఎవరికి అన్యాయం జరిగినా పోరాడాలి అనే అంశాన్ని ఈ సినిమాలో చర్చించామని, యాక్షన్ ఘట్టాలు అద్భుతంగా ఉంటాయని ఆయన అన్నారు. ఈ సినిమాలో వింటేజ్ అర్జున్ను చూస్తారని, ప్రతీ పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని దర్శకుడు సుభాష్ కె రాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.