Arjun Rampal | బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ మరోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ‘ధురంధర్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో విలన్‌గా మరింత గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ రాంపాల్.. తన ప్రియురాలు, మోడల్, నటి గాబ్రియెల్లా డెమెట్రియాడెస్‌ను అధికారికంగా వివాహం చేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంట తాజాగా తమ బంధానికి అధికారికంగా మూడుముళ్ల బంధంతో ముగింపు పలికింది. అర్జున్ రాంపాల్, గాబ్రియెల్లా డెమెట్రియాడెస్లు శుక్రవారం (ఆగస్టు 21) సాయంత్రం ఉత్తర గోవాలోని మపుసా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు సమాచారం. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ జంట కార్యాలయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లి సందర్భంగా ఇద్దరూ ఎలాంటి హంగూ ఆర్భాటాలకు వెళ్లకుండా చాలా సింపుల్‌గా సాధారణ దుస్తుల్లో కనిపించారు.
రిజిస్టర్ మ్యారేజ్ సమయంలో కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు, అత్యంత సన్నిహితులు మాత్రమే వారితో ఉన్నట్లు సమాచారం. గోవాలో అమల్లో ఉన్న యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) నిబంధనల ప్రకారం వీరి వివాహం నమోదు చేసినట్లు మపుసా సబ్-రిజిస్ట్రార్ సూరజ్ వెర్నేకర్ వెల్లడించారు. అర్జున్ రాంపాల్, గాబ్రియెల్లా డెమెట్రియాడెస్ 2018 నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు. చాలా కాలంగా కలిసి జీవిస్తున్న ఈ జంట తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను మాత్రం పెద్దగా బయటకు వెల్లడించలేదు. అయితే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కలిసి కనిపిస్తూ తమ అభిమానులకు తమ బంధాన్ని పరిచయం చేస్తూ వచ్చారు.
దాదాపు ఏడేళ్లపాటు ప్రేమ, సహజీవనం కొనసాగించిన అనంతరం 2025 డిసెంబర్లో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పటినుంచి వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజాగా ఎలాంటి భారీ వేడుకలు లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని తమ బంధాన్ని అధికారికం చేసుకున్నారు. అర్జున్ రాంపాల్, గాబ్రియెల్లా దంపతులకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2019లో వీరికి మొదటి కుమారుడు అరిక్ జన్మించాడు. ఆ తర్వాత 2023లో మరో కుమారుడు ఆరవ్ జన్మించాడు. పిల్లలతో కలిసి ఈ జంట తరచూ సోషల్ మీడియాలో కనిపించినప్పటికీ, తమ కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాల్లో మాత్రం గోప్యతను పాటిస్తూ ఉంటారు. గాబ్రియెల్లా డెమెట్రియాడెస్ విషయానికి వస్తే.. ఆమె దక్షిణాఫ్రికాలో జన్మించి పెరిగారు. చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఆమెకు ఫ్యాషన్, సినిమాలపై ఆసక్తి ఉంది. కేవలం 16 ఏళ్ల వయసులోనే మోడలింగ్ ప్రారంభించిన గాబ్రియెల్లా.. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనర్‌గా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, ‘ధురంధర్’ సినిమాతో అర్జున్ రాంపాల్‌కు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు లభించింది.