Arjun Kalyan | సినిమాలతో కెరీర్ ప్రారంభించి, సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ కళ్యాణ్, రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 6’లో పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించాడు. ప్రస్తుతం పలు టీవీ కార్యక్రమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్న ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అర్జున్ కళ్యాణ్ మాట్లాడుతూ… ఇప్పటివరకు తన జీవితంలో ఐదు బ్రేకప్స్ జరిగాయని వెల్లడించారు. వాటిలో ఒకటి మాత్రమే పరస్పర అంగీకారంతో జరిగిన బ్రేకప్ కాగా, మిగిలినవి ఎక్కువగా వన్ సైడ్ లవ్ స్టోరీలేనని చెప్పారు. చదువుకునే రోజుల్లో కొంతమంది తనకు ప్రపోజ్ చేసినా, తాను మాత్రం సీరియస్‌గా ప్రేమించిన ఒక అమ్మాయికి తన ప్రేమను వ్యక్తం చేసినప్పటికీ, ఆమె నుంచి అంగీకారం రాలేదని తెలిపారు.
ఆ ప్రేమ ఘటనకు చాలా కాలం అయిందని, ఇప్పుడు ఆ భావాలు తగ్గిపోయినా… అప్పట్లో జరిగిన సంఘటన తనకు హార్ట్ బ్రేక్ లా అనిపించిందని చెప్పారు. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట ఆ వ్యక్తి గుర్తుకు వస్తుందని, అయితే గతంలో ఉన్న భావోద్వేగం ఇప్పుడు లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రేమపై తన అభిప్రాయాన్ని కూడా ఆయన పంచుకున్నారు. తాను ప్రేమించే అమ్మాయి తనకే వచ్చి ప్రపోజ్ చేయాలని ఒక కల ఉందని, కానీ అది జరగదని భావిస్తున్నానన్నారు. ప్రస్తుతం నిజాయితీతో ఉన్న ప్రేమ ఎక్కువగా నిలవడం లేదని, మంచి మనసుతో ఉండే అబ్బాయిలను కొందరు తక్కువగా చూస్తారని అభిప్రాయపడ్డారు.
ఇద్దరి మధ్య సంబంధంలో మూడో వ్యక్తి జోక్యం చాలా సమస్యలకు దారితీస్తుందని, తనకు కూడా అలాంటి అనుభవం ఎదురైందని తెలిపారు. ఒక సంబంధంలో పరస్పర అవగాహన బలంగా ఉంటే ఎలాంటి అడ్డంకులు వచ్చినా దాన్ని కాపాడుకోవచ్చని అర్జున్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. మొత్తానికి, తన ప్రేమ జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన అర్జున్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.