చైతన్య రావ్, లావణ్య జంటగా నటిస్తున్న సినిమా ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మిస్తున్నారు. చెందు ముద్దు దర్శకుడు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ సినిమా నుంచి ‘రంగమ్మ’ అనే ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను నటుడు ప్రియదర్శి విడుదల చేశారు. ఈ పాటను ప్రిన్స్ హెన్రీ స్వరకల్పనలో శ్రీనివాస మౌళి సాహిత్యాన్ని అందించగా…ఎస్పీ చరణ్ పాడారు. ‘కంటి చూపు నిన్నే దాటి పోనంటోందమ్మా…కొంటె ఆశలేవో రేగి అదిరిందే బొమ్మ..’అంటూ సాగుతుందీ పాట. ఈ సందర్భంగా నిర్మాత యష్ రంగినేని మాట్లాడుతూ…‘80వ దశకపు సంగీతాన్ని గుర్తుచేసేలా ఈ పాట ఉంటుంది. ఇది మా యూనిట్ అందరికీ ఫేవరేట్ సాంగ్. కథలో కీలకమైన సమయంలో ఈ పాట వస్తుంది. శ్రీనివాస మౌళి గమ్మత్తైన సాహిత్యాన్ని అందించారు. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’ అన్నారు.