Pawan Kalyan – Allu Arjun Arrest | ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 విడుదల రోజున జరిగిన ఘటనకు సంబంధించి కథానాయకుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అరెస్ట్ అనంతరం బన్నీని పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ స్టేట్మెంట్ను రికార్డు చేశారు. స్టేట్మెంట్ రికార్డు అనంతరం అతడిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి అక్కడ నుంచి నాంపల్లి కోర్టు ముందు హాజరుపర్చారు. నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్‌ను విధించగా.. తనపై నమోదైన కేసు కొట్టివేయాలని అల్లు అర్జున్ హైకోర్ట్‌లో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతుంది.
అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి తన సినిమా షూటింగ్‌ను మధ్యలో ఆపేసి బన్నీ ఇంటికి వచ్చిన విషయం తెలిసిందే. చిరు అనంతరం నాగబాబు కూడా బన్నీ ఇంటికి చేరుకున్నాడు. ఇదిలావుంటే అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హుటాహుటిన హైదరాబాద్‌కు వస్తున్నట్లు తెలుస్తుంది. ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్‌కి వచ్చి నేరుగా అల్లు అర్జున్‌ని కలవబోతున్నట్లు సమాచారం.