Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లీడ్ రోల్లో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న భారీ ప్రాజెక్ట్ ‘AA23’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ సినిమా ఇండియన్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్‌కు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనుండగా, సంక్రాంతి సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ వీడియోతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. బన్నీ వాస్‌తో పాటు నట్టి, శాండీ, స్వాతి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఇక ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో ప్రస్తుతం పలు ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ పేరు ఫైనల్ అయిందని ప్రచారం జరుగుతుండగా, తాజాగా మరో స్టార్ హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ వార్తలు పుకార్లుగానే ఉన్నప్పటికీ, అభిమానుల్లో మాత్రం ఆసక్తి పెరుగుతోంది. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే, ఇది పాన్ ఇండియా స్థాయిలో మరింత క్రేజ్ తెచ్చే ప్రాజెక్ట్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తన ‘లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా ముందుగా ‘ఖైదీ 2’పై దృష్టి పెట్టనున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్‌తో సినిమా అనౌన్స్ చేయడంతో ఆ ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన లోకేశ్, అల్లు అర్జున్ను కలవడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఒక ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయ్యాక కొంత బ్రేక్ తీసుకుని ‘AA23’ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే కథ ఫైనల్ కాగా , స్క్రిప్ట్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుంది. యాక్షన్, స్టైల్, స్ట్రాంగ్ నేరేషన్‌తో లోకేశ్ ఈ సినిమాను కొత్త లెవల్‌కు తీసుకెళ్తారని అభిమానులు నమ్ముతున్నారు.