Alia Bhatt | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ పేరు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఈసారి కారణం కొత్త సినిమా కాదు… వివాదంతో. పాకిస్తాన్‌కు చెందిన ఓ ఫ్యాషన్ బ్రాండ్‌కు ఆమె బ్రాండ్ అంబాసిడర్ అయ్యిందంటూ వచ్చిన వార్తలు నెట్టింట పెద్ద చర్చకు దారితీశాయి. పాకిస్తాన్‌కు చెందిన “వజేషా అఫీషియల్” అనే క్లాతింగ్ బ్రాండ్ తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అలియా భట్ ఫోటోలను షేర్ చేయడం ఈ వివాదానికి కారణమైంది. ఈ ఫోటోలలో అలియా వివిధ రంగుల ఎత్నిక్ వేర్లో లావెండర్, బ్లాక్, బర్గుండీ, ఎమరాల్డ్ టీల్ లో మెరిసిపోతున్నట్లు కనిపించింది.
దీనికి తోడు “మా ప్యూర్ శీషా సిల్క్ కలెక్షన్ అలియా భట్‌కు కూడా ఇష్టం” అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. నిజంగానే అలియా ఆ బ్రాండ్‌కు అంబాసిడర్ అయ్యిందా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ పోస్టులు వైరల్ అవ్వడంతో, అలియా భట్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. పాకిస్తానీ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడం ఏంటి? అనే ప్రశ్నలతో కొందరు ఆమెను టార్గెట్ చేశారు. ముఖ్యంగా రాజకీయ, సామాజిక కోణాల్లో ఈ విషయం పెద్ద చర్చకు దారితీసింది.
అయితే ఈ వివాదంలో అసలు నిజం పూర్తిగా భిన్నంగా ఉంది. అలియా భట్ ఏ పాకిస్తానీ బ్రాండ్‌కూ అంబాసిడర్ కాదు. వైరల్ అవుతున్న ఫోటోలు పూర్తిగా ఫేక్ అని తేలింది. సాంకేతిక నిపుణుల ప్రకారం, ఈ చిత్రాలను ఏఐ లేదా హై ఎండ్ ఫోటోషాప్ టూల్స్ ఉపయోగించి రూపొందించారు. అలియా గతంలో పాల్గొన్న ఫ్యాషన్ షూట్స్‌లోని ఫోటోలను తీసుకుని, ఆమె ముఖాన్ని కొత్త దుస్తులపై డిజిటల్‌గా మోర్ఫింగ్ చేసినట్లు సమాచారం. అలియా అనుమతి లేకుండా ఆమె ఫోటోలను ఉపయోగించడం పెద్ద వివాదానికి దారి తీసింది. అసలు విషయం తెలిసిన తర్వాత నెటిజన్లు ఆ బ్రాండ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీల ఇమేజ్ను దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసం అనే చర్చ మొదలైంది. ఈ ఘటన మరోసారి సోషల్ మీడియాలో ఫేక్ కంటెంట్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో తెలియజేసింది. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం వల్ల సెలబ్రిటీలు ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవాల్సి వస్తోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.