చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 153వ చిత్రం ‘గాడ్‌ఫాదర్’. మోహన్ రాజా దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్‌ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తెలుగులో ఆయనకిది తొలి చిత్రం కావడం విశేషం. దర్శకుడు పూరి జగన్నాథ్ అతిథి పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమాలో యువ హీరో సత్యదేవ్ ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి వెల్లడించారు. చిరంజీవి సినిమాలో భాగం కావడం పట్ల సత్యదేవ్ సంతోషం వ్యక్తం చేశారు. ‘అభిమానిగా ఎప్పుడూ మీ పేరునే తలుస్తాను. మీ స్ఫూర్తితోనే నటుడిగా మారాను. ‘ఆచార్య’ చిత్రంలో మీతో పాటు కాసేపు కనిపించే అదృష్టం దక్కింది. మరలా మీతో కలిసి నటించే గొప్ప అవకాశం రావడం ఆనందంగా ఉంది’ అంటూ సత్యదేవ్ ట్వీట్ చేశారు. ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో సత్యదేవ్ పూర్తిస్థాయి పాత్రను పోషిస్తున్నారని, తన అభిమాని ప్రతిభావంతుడైన నటుడు కావడం ఆనందంగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నీరవ్‌షా, సంగీతం: థమన్, నిర్మాతలు: ఆర్.బి.చౌదరి, ఎన్వీప్రసాద్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహన్‌రాజా.