Actor | టాలీవుడ్లో రెండున్నర దశాబ్దాలుగా గుర్తుండిపోయే పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు పీలా గంగాధర్ ప్రస్తుతం జీవిత పోరాటంలో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో జీవనోపాధి కోసం ప్రారంభించిన చిన్న వ్యాపారం కూడా ఇప్పుడు ప్రమాదంలో పడింది. హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో గంగాధర్ ఏర్పాటు చేసుకున్న టీ షాప్ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇటీవల కూల్చివేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై గంగాధర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు.
దాదాపు రూ.3 లక్షల పెట్టుబడితో ఈ చిన్న వ్యాపారాన్ని ప్రారంభించినట్లు గంగాధర్ తెలిపారు. సరైన కారణం చెప్పకుండానే అధికారులు కొద్ది సెకన్లలో తన షాప్ను కూల్చివేశారని ఆరోపించారు. నేను ఒక నటుడిని… బతుకు తెరువు కోసం ఈ టీ షాప్ పెట్టుకున్నాను. ఎవరికీ ఇబ్బంది లేకుండా పక్కగా బండి పెట్టుకున్నా అయినా ఇలా చేయడం బాధాకరం అని ఆయన వాపోయారు. ఈ విషయంపై గంగాధర్ మాట్లాడుతూ తాను ఇప్పటికే వెండార్ లైసెన్సు, ఎన్.ఓ.సి కూడా తీసుకున్నానని చెప్పారు. జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లి అన్ని అనుమతులు పొందిన తర్వాతే షాప్ ఏర్పాటు చేసుకున్నానని తెలిపారు.
అయినప్పటికీ కూల్చివేత సమయంలో అధికారులు స్పష్టమైన కారణం చెప్పలేదని, తనను సరైన విధంగా వినకుండా చర్య తీసుకున్నారని ఆరోపించారు. గంగాధర్ కుటుంబ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. ఆయన తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతుండగా, అన్నయ్య బ్రెయిన్ స్ట్రోక్తో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అక్కకు కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వెల్లడించారు. సినిమాలతో పాటు ఈ టీ షాప్ ద్వారా వచ్చే ఆదాయమే కుటుంబానికి ప్రధాన ఆధారం అని, ఇప్పుడు అది లేకపోవడంతో భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒంగోలు నుంచి హైదరాబాద్కు వచ్చి మొదట ఒక ప్రముఖ నటుడి ఇంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన గంగాధర్… తర్వాత తన కష్టంతో సినీ రంగంలోకి ప్రవేశించారు. దాదాపు 70కి పైగా చిత్రాల్లో ముఖ్యంగా కామెడీ పాత్రలతో ప్రేక్షకులను అలరించారు.