Abisekh Bachchan | బాలీవుడ్ స్టార్ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ బంధంపై ఎప్పటినుంచో వస్తున్న ఊహాగానాల మధ్య తాజాగా అభిషేక్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా… తన భార్యతో ఉన్న అనుబంధం, కుటుంబ జీవితం గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. ప్రఖ్యాత యూట్యూబర్ లిల్లీ సింగ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిషేక్ మాట్లాడుతూ, “నా తల్లిదండ్రులు పెళ్లి చేసుకున్నప్పుడు మా అమ్మ జయా బచ్చన్ మా నాన్న అమితాబ్ బచ్చన్ కంటే పెద్ద స్టార్. అందుకే భార్య విజయవంతంగా ఉండటం నాకు కొత్త కాదు” అని అన్నారు.
తన వ్యాఖ్యల్లో “అహం” అనే పదాన్ని నెగటివ్‌గా కాకుండా ఒక స్పష్టమైన ఆలోచనగా వివరించారు. నేను గెలవాలంటే నా భాగస్వామి ఓడిపోవాల్సిన అవసరం లేదు. నా భర్తతనాన్ని నిరూపించుకోవడానికి నా భార్య తన కెరీర్ ఆపాల్సిన అవసరం లేదు. అలాంటి బంధమే నాకు కావాలి. అదృష్టవశాత్తు ఐశ్వర్య కూడా ఇదే విధంగా ఆలోచిస్తుంది. అందుకే మా రిలేషన్‌షిప్‌కు నా ‘అహం’నే కారణం అన్నాను” అని చెప్పారు. అభిషేక్ వెల్లడించిన ప్రకారం, కెరీర్ ప్రారంభం నుంచే ఐశ్వర్యతో తనకు పరిచయం ఉందని, మొదట వారు మంచి స్నేహితులుగా ఉన్నారని గుర్తుచేసుకున్నారు. ఆ స్నేహమే తర్వాత ప్రేమగా మారి, 2007 ఏప్రిల్ 20న వివాహ బంధంగా మారింది. ఈ ఏడాదితో వారి వివాహానికి 19 ఏళ్లు పూర్తవుతున్నాయి.
తమ కుమార్తె ఆరాధ్య బచ్చన్ పెంపకం గురించి కూడా అభిషేక్ ఓపెన్‌గా మాట్లాడారు. తండ్రులు మంచి టీచర్లు కారు. ఎందుకంటే భావోద్వేగాలు అడ్డువస్తాయి. మహిళల్లో ఉండే సున్నితత్వం మాలో ఉండదు. మగవాళ్లు ఎక్కువగా చేతల ద్వారా తమను నిరూపించుకోవాలనుకుంటారు అని చెప్పారు. పిల్లలకు ఇది సరైంది, ఇది తప్పు అని చెప్పడం కంటే, మనం ఎలా జీవిస్తున్నామన్నదే ముఖ్యమైన పాఠం. తల్లిదండ్రులు నైతిక విలువలతో జీవిస్తే పిల్లలు వాటిని చూసి నేర్చుకుంటారు. మా ఇంట్లో ఎవరు మగ, ఎవరు ఆడ అన్న పోటీ ఎప్పుడూ ఉండదు అని స్పష్టం చేశారు. కాగా, ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఈ జంట విడిపోతున్నారనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే అభిషేక్ చేసిన ఈ తాజా వ్యాఖ్యలు ఆ ఊహాగానాలకు చెక్ పెట్టినట్లుగా భావిస్తున్నారు.