Aamir Khan | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మరోసారి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. 61 ఏళ్ల ఆమిర్ తన భాగస్వామి, 47 ఏళ్ల గౌరీ స్ప్రాట్‌ను జులై 5న వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. ముంబైలోని ఆమిర్ నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక చాలా సైలెంట్‌గా, ప్రైవేట్ రిజిస్టర్ మ్యారేజ్ రూపంలో జరగబోతుంది. తమ బంధాన్ని అధికారికం చేసుకోవాలని ఈ జంట ఇటీవలనే నిర్ణయించుకుందని, ఇరు కుటుంబాల మద్దతుతో ఇప్పటికే వివాహ ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయని వారి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితుల మధ్యే ఈ వేడుకను ముగించాలని వారు భావిస్తున్నారు. ఈ ప్రైవేట్ వివాహ వేడుకకు ఆమిర్ ఖాన్ మిత్రులైన బాలీవుడ్ సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల్లో గట్టిగా ప్రచారం నడుస్తుంది.
గౌరీ స్ప్రాట్‌కు గత వివాహం ద్వారా క్విన్ అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆమె తాతగారైన ఫిలిప్ స్ప్రాట్ బ్రిటన్ సంతతికి చెందిన కమ్యూనిస్ట్ కాగా, ఆయన 1920లలో భారతదేశానికి వచ్చి ఇక్కడి స్వాతంత్ర్య పోరాటంలో కూడా పాల్గొన్నారు. గత ఏడాది ముంబైలో జరిగిన తన ప్రీ-బర్త్‌డే వేడుకలో ఆమిర్ ఖాన్ మొదటిసారిగా గౌరీని మీడియాకు పరిచయం చేశారు. ఆమిర్ ఖాన్‌కు ఇది మూడో వివాహం కానుంది. ఆయనకు గతంలో రీనా దత్తాతో వివాహం జరగ్గా, వారికి జునైద్, ఇరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత ఆయన దర్శకురాలు కిరణ్ రావును వివాహం చేసుకోగా, వారికి ఆజాద్ అనే కుమారుడు జన్మించాడు. ఆమిర్, కిరణ్ రావు జంట 2021లో తమ విడాకులను ప్రకటించారు. ఇప్పుడు జులై 5న జరగబోయే రిజిస్టర్ మ్యారేజ్ మరియు చిన్న ఫ్యామిలీ గెట్-టుగెదర్ ద్వారా ఆమిర్, గౌరీ తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభించనున్నారు.