Aamir Khan | భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించి ‘లగాన్’ వంటి బ్లాక్ బస్టర్‌ను అందించిన గ్రేట్ కాంబో దాదాపు 25 ఏండ్ల తర్వాత మళ్లీ కలువబోతున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన వైవిధ్యమైన నటనతో, అశుతోష్ గోవారికర్ తన అద్భుతమైన మేకింగ్‌తో భారత క్రికెట్ దిగ్గజం లాలా అమర్నాథ్ జీవిత విశేషాలను వెండితెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్ కేవలం ఒక క్రీడాకారుడి బయోపిక్‌గానే కాకుండా, దేశ చరిత్రలోని కీలక ఘట్టాలను చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
1933లో భారత క్రికెట్ తరపున తొలి టెస్ట్ సెంచరీ సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా లాలా అమర్నాథ్ చరిత్ర సృష్టించారు. స్వాతంత్ర్యానంతరం భారత జాతీయ జట్టుకు తొలి కెప్టెన్‌గా వ్యవహరించిన ఆయన ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అయితే ఈ చిత్రంలో కేవలం ఆయన క్రికెట్ రికార్డులను మాత్రమే కాకుండా, 1947 నాటి దేశ విభజన సమయంలో చోటుచేసుకున్న భయానక పరిస్థితులు, ఆ అల్లకల్లోల వాతావరణం ఆయన వ్యక్తిగత, వృత్తిగత జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేశాయనే కోణాన్ని అత్యంత భావోద్వేగభరితంగా చిత్రీకరించబోతున్నారు.
ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమీర్ ఖాన్ తన పాత్ర కోసం ఇప్పటికే ప్రత్యేక కసరత్తులు ప్రారంభిస్తున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను సెప్టెంబర్ 2026లో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్రణాళికలు రూపొందిస్తోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘లగాన్’ ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్లి ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా సత్తాను చాటిచెప్పిన నేపథ్యంలో మళ్లీ ఇదే కాంబినేషన్ నుండి మరో క్రికెట్ నేపథ్యంలో వస్తున్న ఈ బయోపిక్ పై అటు సినీ ప్రియులలోనూ, ఇటు క్రికెట్ అభిమానులలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.