Aamir Khan Third Wed | బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తన వివాహ వార్తలను అధికారికంగా ధృవీకరించాడు. ఆయన తన చిరకాల భాగస్వామి గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోబోతున్నాడని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై ముంబైలో జరిగిన ఒక సినిమా స్క్రీనింగ్ ఈవెంట్లో ఆమిర్ ఖాన్ స్వయంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు. జూలై 5వ తేదీన తమ వివాహం జరగనుందని, ఈ వేడుకను ఎటువంటి ఆడంబరాలు లేకుండా, అత్యంత సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో ముంబైలోని తన నివాసంలోనే సింపుల్‌గా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇది తమ ఇద్దరికీ ఎంతో ప్రత్యేకమైన రోజు అని, అందరి ఆశీస్సులు, దీవెనలు తమకు కావాలని, తాము ఎప్పుడూ సంతోషంగా ఉండేలా ప్రార్థించాలని అమీర్ ఖాన్ మీడియా ద్వారా కోరారు. ఈ వివాహానికి ఎలాంటి భారీ వెడ్డింగ్ రిసెప్షన్ లేదా స్టార్-స్టడెడ్ ఈవెంట్‌ను నిర్వహించే ఉద్దేశం వారికి లేదని సమాచారం. ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నారు.
గౌరీ స్ప్రాట్ బెంగళూరుకు చెందిన వెల్నెస్ రంగానికి చెందిన మహిళ. అంతేకాకుండా ఆమె భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న బ్రిటీష్ కమ్యూనిస్ట్ ఫిలిప్ స్ప్రాట్ మనవరాలు. గత కొంతకాలంగా ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ పనుల్లో కూడా ఆమె సహాయం అందిస్తున్నారు. గతేడాది మార్చిలో తన 60వ పుట్టినరోజు సందర్భంగా ఆమిర్ ఖాన్ ఆమెను మొదటిసారి మీడియాకు భాగస్వామిగా పరిచయం చేశారు. ఆమిర్ ఖాన్‌కు ఇది మూడో వివాహం కాగా, అంతకుముందు ఆయన రీనా దత్తా, కిరణ్ రావులను వివాహం చేసుకొని విడాకులు తీసుకున్నారు. ఈ కొత్త ప్రయాణంలో ఆమిర్ ఖాన్ పిల్లలు జునైద్, ఐరా, ఆజాద్‌లతో పాటు గౌరీ స్ప్రాట్ కుమారుడు క్విన్ కూడా ఈ వివాహ వేడుకల్లో కీలక భాగం కాబోతుండటం విశేషం.