చైతన్య రావ్, లావణ్య జంటగా బిగ్ బెన్ సినిమాస్ సంస్థ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఈ సినిమాను యష్ రంగినేని నిర్మాణంలో దర్శకుడు చెందు ముద్దు రూపొందిస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత యష్ రంగినేని మాట్లాడుతూ..“పెళ్లి చూపులు’ నుంచి మా సంస్థలో కథను నమ్మి సినిమాలు చేస్తూ వస్తున్నాం. ఈ చిత్రంలో స్టార్స్ లేరు. కథే స్టార్. గ్రామీణ నేపథ్యంతో సాగే చిత్రమిది. ఆగస్ట్ 1 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం. అమలాపురం, అరకు, కేరళ వంటి ప్రాంతాల్లో చిత్రీకరణ చేయబోతున్నాం. అక్టోబర్ కల్లా ఫస్ట్ కాపీని సిద్ధం చేయాలని ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ…‘అంతా కొత్త వాళ్లం చేస్తున్న ఈ సినిమాను ప్రయోగాత్మకంగా తెరకెక్కించాలని భావిస్తున్నాం. లొకేషన్స్, మేకింగ్ అంతా విభిన్నంగా ఉంటుంది’ అన్నారు.