Savings & Invesments | బీటెక్. ఎంబీఏ.. సాఫ్ట్వేర్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో ట్రైనింగ్.. విద్యాబ్యాసం పూర్తయిన తర్వాత ఎడ్యుకేషన్‌కు అనుగుణంగా యువత జాబ్ సంపాదించుకుని సంపాదన ప్రారంభిస్తారు. కానీ, ఆ డబ్బు ఎలా మేనేజ్ చేయాలో తెలియక సతమతం అవుతుంటారు.. అందుకు యువతరం ఏం చేయాలో తెలుసుకుందామా.. !
ఆధునిక టెక్నాలజీ, జీవన విధానాలు, ప్రజల అవసరాల్లో మార్పుల వల్ల యువతరం ప్రస్తుతం ఏదో ఒక జాబ్ పొందే వరకు రెస్ట్ తీసుకోవడం లేదు. రోజురోజుకు ఖర్చులు పెరిగిపోతుండటంతో పేరెంట్స్‌కు భారం కాకూడదని భావిస్తూ వీలైనంత త్వరగా ఉద్యోగం.. బిజినెస్ల్లోనో సెటిల్ కావాలని యూత్ భావిస్తున్నారు. చిన్నప్పుడే డబ్బు సంపాదన మొదలు పెడితే త్వరితగతిన రిటైరై మలిదశ జీవితాన్ని ఆనందంగా, సంతోషంగా గడుపాలని కలలు కంటూ ఉంటారు. అందుకే పిన్న వయస్కులుగా ఉన్నప్పుడే భారీ మొత్తంలో సంపాదన మార్గాలపై ఫోకస్ చేస్తున్నారు.
ఆదాయం సంపాదించడానికి యువత అనుసరిస్తున్న వ్యూహం సరిగ్గానే ఉంటున్నా.. అలా వచ్చే మనీ నిర్వహణలో.. పొదుపు చేయడంలో ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. ఎంత మొత్తం.. ఏయే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి.. ఖర్చుల్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే సంగతులు తెలియక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంలో గందరగోళానికి గురవుతున్నారు. జీతం సంపాదిస్తున్న తొలి రోజుల్లో భారీ ఖర్చులు చేయడానికి దూరంగా ఉండాలి. నెలవారీ ఆదాయం ఖర్చు తీరును నిశితంగా కొన్ని నెలలు చెక్ చేస్తూ ఉండాలి. ఇంటి అద్దె, ఫోన్, భోజనం, ప్రయాణం తదితర నిత్యావసరాలకు అవుతున్న ఖర్చు.. తెలియకుండా వచ్చి పడే ఖర్చులను నెలల తరబడి చెక్ చేయాలి. ఉద్యోగం వచ్చిందని తొందరపడి వెహికల్ లేదా ఇల్లు కొనుగోలు చేయడానికి పరుగెత్త వద్దని నిపుణులు చెబుతున్నారు.
మీరు నెలవారీ సంపాదనను సమర్థంగా ఉపయోగించాలి. నెలవారీ ఖర్చులు మినహా మిగతా సొమ్ము ఖర్చు ఎలా జరుగుతున్నదన్న విషయం చాలా ముఖ్యమైంది. అసలు మనీ నిర్వహణ ఒక కళ.. నైపుణ్యం.. అనునిత్యం వచ్చే కొత్త ఖర్చులను బట్టి మీ వద్ద డబ్బు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. బ్యాంకు సేవింగ్స్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంతుందో నిత్యం చెక్ చేసుకుంటూ ఉండాలి. నెల మొత్తానికయ్యే ఖర్చులకు సరిపోయేలా ఉన్నాయా? లేదా? అని పరిశీలించాలి. అలా ఖర్చులన్నీ పోనూ.. మిగిలిన సొమ్ము ఏం చేయాలన్న విషయమై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. యువతకు ఉండే జనరల్ లక్షణం.. బద్ధకం.. ఇది ఫోన్, ఇంటి అద్దె, విద్యుత్ తదితర బిల్లులను సకాలంలో చెల్లించడంలో ఆలస్యానికి కారణం అవుతుంది. ఈ బద్ధకం సమస్యను అధిగమించడానికి సరైన రూట్ ఆటో పే.. ప్రతి ఖర్చు కూడా మేనేజ్ చేయాలంటే కొంత ఇబ్బందికరమే.. కానీ కొన్ని బిల్లులకు ఆటో పే ఆప్షన్ సెట్ చేస్తే ఏ సమస్య ఉండదు.
మనీ నిర్వహణపై ఒక క్లారిటీ వచ్చే వరకు క్రెడిట్ కార్డు తీసుకోకుండా ఉండటమే బెటర్. అలా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత కూడా ఎమర్జెన్సీ అనిపిస్తేనే క్రెడిట్ కార్డు తీసుకోవాలి.. క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత నెలవారీ ఈఎంఐ పేమెంట్స్ ఆప్షన్ ఎంచుకున్నా.. బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయడం బెటర్‌గా ఉంటుంది. లగ్జరీ లైఫ్ కోరుకుంటే ఖర్చులూ ఆ స్థాయిలోనే ఉంటాయి. కనుక సంపాదన తొలిరోజుల్లో లగ్జరీ ఖర్చులు, వసతులకు దూరంగా ఉండటం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు. అలా కాకుండా ముందు నుంచి లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడితే.. ఇబ్బందులు తలెత్తినప్పుడు ఖర్చులు మేనేజ్ చేయలేక సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుంది.
అనునిత్యం బ్యాంకుల్లో కేవైసీ పత్రాల సబ్మిషన్, ఆధార్-పాన్ లింకేజ్తోపాటు ఇన్వెస్ట్మెంట్లకు స్పెషల్ అకౌంట్స్ ప్రారంభించడం వంటి చర్యలన్నీ ముందుగా పూర్తి చేసుకోవాలి. అటువంటప్పుడే మీ జీవిత లక్ష్యాలకు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్స్, టాక్స్ పేమెంట్స్‌కు ఇబ్బందులు ఉండవు. మీ ఆదాయం ఇన్‌కం టాక్స్ పరిధిలోకి వస్తే మీరే ఐటీఆర్ ఫైల్ చేయాలి. అందుకు ఆదాయం పన్నుశాఖ వారి వివిధ రకాల ఐటీఆర్ ఫామ్స్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటే బావుంటుంది. ఇంటి పన్ను, నీటి పన్ను, ఇతర టాక్స్‌ల చెల్లింపుల పనులు మీరే సొంతంగా పూర్తి చేయాలి.. అప్పుడే మీ కంటూ ఒక ప్లాన్ ఖరారు చేసుకోగలుగుతారు.
రోజువారీ నిత్యావసర ఖర్చులకు ముందే మనీ పక్కన బెట్టాలి. సరదా పార్టీలు, సినిమాలకు వెళ్లడం వంటి ఖర్చులు సందర్భోచితంగా వచ్చినా.. వాటికీ స్పెషల్ కేటాయింపులు ఉంటే మీ ఖర్చుల గురించి ముందే ఒక అవగాహన ఉంటుంది. తీసుకున్న రుణాలు ముఖ్యంగా విద్యాభ్యాసం టైంలో తీసుకున్న రుణాలు త్వరితగతిన పే చేయడానికి ప్రియారిటీ ఇవ్వాలి. రుణాల చెల్లింపుల్లో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా వడ్డీ భారం పెరిగిపోయి దీర్ఘకాలిక లక్ష్యాలకు ఆటంకంగా పరిణమిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఒక సంస్థలో పని చేస్తున్నప్పుడు వేతనంలో నిర్ధిష్ట మొత్తం పీఎఫ్‌లో జమ అవుతుంది. కనుక పెద్ద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లను ఆశ్రయించవద్దని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. కనీసం ఒక ఏడాది పాటు పొదుపుపై దృష్టి సారిస్తే భవిష్యత్ ప్లాన్లపై ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాతే కుటుంబ అవసరాలను పరిగణనలోకి తీసుకుంటూ లక్ష్యాలను బట్టి పొదుపు, ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్‌లో పెట్టుబడులు పెడితే సరి. సంపాదనలో అత్యధికం పెట్టుబడి మార్గాల్లోకి మళ్లించి, నిత్యావసర ఖర్చులకు ఇబ్బందుల పాలవ్వొద్దని ఆర్థిక వేత్తలు, నిపుణులు సూచిస్తున్నారు.