గర్జించిన రిలయన్స్.. రెండో త్రైమాసికంలో రూ.29,550 కోట్లు
చమురు నుంచి టెలికాం వరకు సేవలు అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డుస్థాయి లాభాలను ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.29,550 కోట్ల నికర లాభాన్ని గడించింది.
- దన్నుగా నిలిచిన రిఫైనింగ్, డిజిటల్ విభాగాలు
- రికార్డుస్థాయి లాభాలను ఆర్జించిన సంస్థ
న్యూఢిల్లీ, అక్టోబర్ 30 : చమురు నుంచి టెలికాం వరకు సేవలు అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డుస్థాయి లాభాలను ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.29,550 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.22,092 కోట్లతో పోలిస్తే 33.8 శాతం వృద్ధిని కనబరిచింది. రిఫైనింగ్ మార్జిన్లు అధికంగా ఉండటం, డిజిటల్ బిజినెస్ అంచనాలకుమించి రాణించడంతో సంస్థ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించినట్టు వెల్లడించింది. ప్రతి షేరుకూ రూ.18.88 ఆర్జించినట్టు అయింది.
క్రితం ఏడాది ఇది రూ.13.42గా నమోదైనట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. తొలి త్రైమాసికంలో నమోదైన రూ.20,946 కోట్ల లాభంతో పోలిస్తే కూడా రెండంకెల వృద్ధి నమోదైంది. సమీక్షాకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 28 శాతం ఎగబాకి రూ.3,62,269 కోట్లకు చేరుకున్నది. దీంట్లో చమురు నుంచి కెమికల్ వ్యాపారంతో వచ్చిన రూ.2.31 లక్షల కోట్ల ఆదాయంపై రూ.25,203 కోట్ల నికర లాభాన్ని గడించింది. హోర్ముజ్ జలసంధితో సహా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చమురు సరఫరాలో అంతరాయాలు, రష్యాలోని శుద్ధి మౌలిక సదుపాయాలపై జరిగిన దాడుల కారణంగా చమురు ధరలు మూడు రెట్ల వరకు పెరిగాయి.
నిరాశపరిచిన రిటైల్ వెంచర్
రిలయన్స్ ఇండస్టీస్ అనుబంధ సంస్థయైన రిలయన్స్ రిటైల్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ నికర లాభం 24.3 శాతం తగ్గి రూ.2,611 కోట్లకు పరిమితమైంది. ఆదాయం 6.4 శాతం ఎగబాకి రూ.91,716 కోట్లకు చేరుకున్నది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అత్యంత అస్థిరమైన, సవాల్‌తో పరిస్థితుల్లోనూ ఓ2సీ వ్యాపారం మెరుగైన పనితీరు కనబరిచిందని రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తెలిపారు.
జియో లాభం 8,389 కోట్లు
దేశీయ టెలికాం దిగ్గజం జియో అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.8,389 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.7,379 కోట్లతో పోలిస్తే 13.7 శాతం వృద్ధిని కనబరిచింది. సమీక్షకాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 11.4 శాతం ఎగబాకి రూ.47,485 కోట్లకు చేరుకున్నది. ఈవారం ప్రారంభంలో స్టాక్ మార్కెట్లో లిైస్టెన తర్వాత విడుదలైన తొలి ఆర్థిక ఫలితాలు ఇవే కావడం విశేషం. ప్రస్తుతం జియోకు 54.24 కోట్ల మంది మొబైల్ యూజర్లు ఉన్నారు. ఒక్కో కస్టమర్ నుంచి సరాసరిగా రూ.218.8 ఆదాయాన్ని ఆర్జించింది.
- రిలయన్స్ ఎఫ్ఎంసీజీ విభాగం రూ.8,266 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
- జియోస్టార్ ఆదాయం 10 శాతం ఎగబాకి రూ.6,806 కోట్లుగా నమోదైంది. జియోహాట్‌స్టార్‌కు నెలవారీగా 44 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు.
- 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రూ.52,746 కోట్ల లాభాన్ని గడించింది.
- ఆర్థిక చెల్లింపులు 24.2 శాతం ఎగబాకి రూ.8,481 కోట్లకు చేరుకున్నాయి.
- కంపెనీ నికర అప్పులు రూ.1,22,914 కోట్ల నుంచి రూ.117,140 కోట్లకు తగ్గాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లో జియో రికార్డు స్థాయిలో లిస్టింగ్ అవ్వడంతో రిలయన్స్ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. 22 రెట్లకు పైగా సబ్స్క్రిప్షన్ పెరుగుదల, లిస్టింగ్ విలువలో బలమైన వృద్ధితో అనేక ప్రపంచ ప్రమాణాలు నెలకొల్పింది. దేశీయ ధోరణి, కార్యాచరణ, ఇంటిగ్రేటెడ్ వ్యాపారాలు అంచనాలకుమించి రాణించడం వల్లనే రికార్డు స్థాయి ఫలితాలు ఆర్జించడానికి కారణమయ్యాయి.
– ముకేశ్ అంబానీ, రిలయన్స్ చైర్మన్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

