Oracle layoff : ఐటీసహా వివిధ రంగాల్లో ఉద్యోగాల తొలగింపునకు ఏఐ ప్రధాన కారణంగా మారుతోంది. ఇప్పుడు ఏఐ ప్రభావంతో మరో సంస్థ కూడా భారీ సంఖ్యలో సిబ్బందిని తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఒరాకిల్ సంస్థ ఏకంగా 30,000 వరకు ఉద్యోగాల్ని తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనికి కారణం ఓపెన్ఏఐ. ఇన్వెస్ట్మెంట్ బ్యాండ్ టీడీ కోవెన్ ప్రకారం.. ఓపెన్ఏఐ సంస్థతో ఒరాకిల్ 300 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది.
ఇది ఈ కంపెనీకి అతిపెద్ద డీల్. దీని ద్వారా భారీ స్థాయిలో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలనుకుంటోంది. అయితే, ఇది అమలు చేయాలంటే నిధులు చాలా అవసరం. అందుకే ఖర్చులు తగ్గించుకునేందుకు ఏకంగా 20,000 నుంచి 30,000 మంది సిబ్బందిని తొలగించేందు ఒరాకిల్ రెడీ అవుతోంది. దీనివల్ల కంపెనీకి 8 బిలియన్ డాలర్ల నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు మిగులుతుంది. ఓపెన్ఏఐతో ఒప్పందమే ఒరాకిల్ సంస్థను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతోంది. గడిచిన రెండు నెలల్లోనే 58 బిలియన్ డాలర్లు ఒరాకిల్ కోల్పోయింది. డేటా సెంటర్ల కోసం 38 బిలియన్ డాలర్లు, న్యూ మెక్సికోలో కొత్త క్యాంపస్ కోసం 20 బిలియన్ డాలర్లు అవసరం. ఈ మూడింటి వల్లే ఒరాకిల్ నష్టాలు 100 బిలియన్ డాలర్లుగా ఉంది. మరోవైపు గత సెప్టెంబర్ నుంచి ఒరాకిల్ స్టాక్ విలువ భారీగా పడిపోయింది.
సగానికి సగం తగ్గి 463 బిలియన్ డాలర్లు తగ్గింది. మరోవైపు అమెరికన్ బ్యాంకులు కూడా ఒరాకిల్‌కు నిధులు ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఒకవేళ అప్పులు ఇవ్వాలన్నా.. వడ్డీ రేట్లు రెట్టింపు చేస్తున్నాయి. కొన్ని ఆసియా బ్యాంకులు మాత్రం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. అవి సరిపోవు. అందుకే తమ క్లయిట్స్ను 40 శాతం చెల్లింపులు తక్షణమే చేయాల్సిందిగా కోరుతోంది. ఇలాంటి ఆర్థిక ఇబ్బందుల మధ్య కంపెనీ.. వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు తెలుస్తోంది.