IT Notice | మీరు పన్ను చెల్లించి.. సకాలంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినా ఆదాయం పన్ను విభాగం (ఐటీ డిపార్ట్మెంట్) నోటీసులు జారీ చేసిందా..? అలా నోటీసులు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయా? అంటే అవుననే అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. సాధారణ కారణాలతోపాటు ఆస్తులు/ ఆదాయంపై సరైన సమాచారం ఇవ్వక పోయినా.. వాస్తవంగా మీరు పొందే ఆదాయం.. ఐటీ రిటర్న్స్‌లో వెల్లడించే ఆదాయంలో తేడాలు ఉన్నా.. పెట్టబడుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నా.. లావాదేవీల్లో అధిక ఆదాయం వంటి కారణాలు ఉండవచ్చు. అంతే కాదు.. ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేసినా.. గతేడాది బకాయిలు చెల్లించకున్నా ఐటీ విభాగం మీకు నోటీసులు ఇవ్వొచ్చు. గత నెలాఖరుతో ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు పూర్తయిన తర్వాత లక్ష మందికి పైగా ఐటీ విభాగం నుంచి నోటీసులు అందుకున్నారు.
అసెస్మెంట్ ప్రక్రియ పూర్తి చేయడానికి ఆదాయం పన్ను విభాగం .. ఐటీఆర్ దాఖలు చేసిన వారి నుంచి మరింత సమాచారం కోరుతుంది. మీ ఐటీఆర్ లో పూర్తి సమాచారం లేకున్నా.. తప్పుడు సమాచారం ఇచ్చినా, ఆదాయం పన్ను చట్టంలోని 139 (1) సెక్షన్ కింద నోటీసు జారీ కావచ్చు. ఈ నోటీసు అందుకున్న 15 రోజుల్లో సరిదిద్దుకోవాలి.
మీరు ఫైల్ చేసిన ఐటీఆర్ పత్రాలతో సంబంధిత అధికారి సంత్రుప్తి చెందకుంటే 143 (2) సెక్షన్ కింద నోటీసు జారీ చేస్తారు. తదుపరి పరిశీలన కోసం మీరు అదనపు సమాచారం సమర్పించాల్సి ఉంటుంది.
ఏదైనా పన్ను, వడ్డీ లేదా పెనాల్టీ చెల్లింపులు బకాయి పడితే 156 సెక్షన్ కింద నోటీసు జారీ చేస్తారు. ఇంతకుముందు నుంచి చెల్లించని పన్నులు పే చేయాలని 245 సెక్షన్ కింద నోటీసు జారీ చేయొచ్చు. మీ ఆదాయాన్ని ఖచ్చితంగా అంచనా వేయడానికి 148 సెక్షన్ కింద ఐటీ అధికారి నోటీసు ఇవ్వవచ్చు.
ఉద్యోగ రీత్యా సొంతూళ్లో కాకుండా నగరంలో అద్దె ఇంట్లో దిగితే.. హెచ్ఆర్ఏ, హోంలోన్, దానిపై వడ్డీ చెల్లింపులపైనా పన్ను రాయితీ క్లయిమ్ చేస్తారు కొందరు. ఇంటి అద్దె లక్ష కంటే ఎక్కువగా ఉంటే.. ఆ ఇంటి యజమాని పేరు, పాన్ కార్డు, చిరునామా తప్పనిసరిగా ఇవ్వాలి. పాన్ లేకుండా హెచ్ఆర్ఏ క్లయిమ్ చేసినా ఐటీ విభాగం నోటీసులు జారీ చేయొచ్చు. ఐటీఏ, హెచ్ఆర్ఏ లేదా ఆదాయం పన్ను చట్టంలోని 80సీ, 80డీ సెక్షన్ల మినహాయింపులు క్లయిమ్ చేస్తే సపోర్టింగ్ డాక్యుమెంట్లు అడుగొచ్చు.
మీరు ఫైల్ చేసిన ఐటీ రిటర్న్స్‌లో టీడీఎస్ క్రెడిట్, మీ ఫామ్ 26ఏఎస్ లో నిర్దారించిన మొత్తం కంటే ఎక్కువ ఉన్నా ఐటీ విభాగం నోటీసు జారీ చేస్తుంది. ఇక విలువైన ఆస్తుల క్రయ విక్రయాలు చేసినా, అధిక మొత్తంలో క్రెడిట్ కార్డు లావాదేవీలున్నా, బ్యాంకు ఖాతాలో అధిక విలువ గల లావాదేవీలు నమోదు కావచ్చు. అటువంటప్పుడు కూడా ఐటీశాఖ నోటీసు ఇస్తుంది. మీ పిల్లల్లో మైనర్లపై పెట్టుబడుల మీద వచ్చే ఆదాయం కూడా మీ ఆదాయంతోనే జత చేస్తారు.
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేవారు తమకు వచ్చే ఇతర ఆదాయాన్ని ప్రత్యేకంగా వెల్లడించాలి. బ్యాంకు డిపాజిట్లలో వడ్డీలే, ఇతర సేవలపై వచ్చే ఆదాయాన్ని కూడా ఐటీ రిటర్న్స్‌లో చూపాలి. ఆటోమేషన్ ఆధారంగా మీ క్లయిమ్ల్లో రియాల్టీని అంచనా వేస్తారు. కనుక ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నప్పుడు ఖచ్చితమైన వివరాలు వెల్లడిస్తేనే బెటర్ అని ఆర్థిక నిపుణులు, చార్టర్డ్ అకౌంటెంట్లు చెబుతున్నారు.