Forex Reserves | ముంబై, ఫిబ్రవరి 23: విదేశీ మారకం నిల్వలు తరిగిపోయాయి. గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన ఫారెక్స్ రిజర్వులు రెండు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ తగ్గడంతో గతవారాంతానికి ఫారెక్స్ రిజర్వులు 1.13 బిలియన్ డాలర్లు తగ్గి 616.10 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంతక్రితం వారంలో రిజర్వులు 5.3 బిలియన్ డాలర్లు తగ్గిన విషయం తెలిసిందే.
విదేశీ కరెన్సీ రూపంలో ఆస్తుల విలువ 740 మిలియన్ డాలర్లు తరిగిపోయి 545.78 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. పసిడి రిజర్వులు 362 మిలియన్ డాలర్లు తరిగిపోయి 47.38 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి వద్ద ఉన్న నిల్వలు మిలియన్ డాలర్లు తగ్గి 4.83 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. సెప్టెంబర్ 2021లో రికార్డు స్థాయి 642.45 బిలియన్ డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో కరెన్సీలు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో రిజర్వుబ్యాంక్ డాలర్లను కొనుగోలు చేసింది.