న్యూఢిల్లీ, మార్చి 28: చిరుద్యోగుల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నది. రెక్కలు ముక్కలు చేసుకొని నాలుగు పైసలు సంపాదించుకొనే వీరంతా భవిష్యత్తుపై భరోసా కోసం ఎంప్లాయీస్ ఫ్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌వో)లో నెలనెలా కొంత చందా రూపంలో పొదుపు చేసుకొంటారు. దాని పై తగిన వడ్డీ లభిస్తే కాస్తోకూస్తో మేలు జరుగుతుంది. కానీ, సామాన్యులపై ఏమాత్రం జాలిలేని కేంద్రం.. ఈపీఎఫ్‌వో వడ్డీ రేటు విషయంలో నిర్దయగా ఉంటోంది. తమ హయాంలో 70 పైసలు తగ్గించి.. 5 పైసలు వేసింది.
ఈపీఎఫ్‌వో అత్యున్నత నిర్ణాయక సంస్థ సెంట్రల్ బోర్డు ట్రస్టీ సీబీటీ మంగళవారం సమావేశమై 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌వో వడ్డీరేటును 8.10 శాతం నుంచి 8.15 శాతానికి పెంచాలని నిర్ణయించింది. కేంద్ర కార్మికశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో తీసుకొన్న ఈ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థికశాఖకు పంపుతారు. ఆర్థికశాఖ ఆమోదిస్తే సీబీటీ నిర్ణయం అమల్లోకి వస్తుంది. అయితే, 2015-16లో వడ్డీరేటు 8.8 శాతం ఉండగా, ఏటా దీనిని తగ్గిస్తూ 1977-78 స్థాయి దరిదాపుల్లోకి తెచ్చారు. 2021-22లో 8.1 శాతానికి వడ్డీరేటును తగ్గించింది. ఇది 40 ఏండ్ల కనిష్టం. దీంతో చిరుద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోయారు.
ఒక స్థాయికి మించి ఉద్యోగులున్న కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ఈపీఎఫ్‌వోలో చందాదారులుగా చేరటాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. నెలనెలా ఉద్యోగి జీతం నుంచి కొంతమొత్తం ఈపీఎఫ్‌వోలో జమ అవుతుంది. ఉద్యోగి పదవీ విరమణ తర్వాత ప్రతినెలా పెన్షన్ రూపంలో కొంత మొత్తాన్ని ఉద్యోగికి ఈపీఎఫ్‌వో చెల్లిస్తుంది. అయితే, ప్రస్తుతం వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కూడా ఉద్యోగులకు ఇలాంటి పెన్షన్ పథకాలను అందిస్తున్నాయి. వాటిల్లో ఈపీఎఫ్వోకంటే అధిక వడ్డీని అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఈపీఎఫ్‌వో మాత్రం ఏటేటా వడ్డీరేటును తగ్గిస్తూ ఉద్యోగులు, పెన్షనర్ల శ్రమను అడ్డంగా దోచుకొంటున్నదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా నరేంద్రమోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆరుకోట్ల మంది ప్రయోజనాలను కాలరాస్తున్నదని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.
ఈపీఎఫ్‌వోలో ప్రస్తుతం 6 కోట్లమంది చందాదారులున్నారు. వీరి చందాల మొత్తం రూ.11 లక్షల కోట్లు ఈపీఎఫ్‌వోలో ఉన్నది. తాజా వడ్డీరేటు ప్రకారం వీరికి ఏడాదిలో రూ.90 వేల కోట్ల వడ్డీ లభిస్తుంది. అయితే, గత కొన్నేండ్లుగా వడ్డీరేటును తగ్గిస్తూ రావటంతో ఉద్యోగులు, పెన్షనర్లు భారీగా వడ్డీని నష్టపోయారు..