న్యూఢిల్లీ: అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు వీలైనవే క్రెడిట్ కార్డులు.. వాటి బిల్లులను నిర్ధిష్ట తేదీలోగా చెల్లించాలి. గడువులోగా బిల్లు చెల్లించే వారికి వడ్డీ వర్తించదు. టైం దాటితే మాత్రం చెల్లించాల్సిన మొత్తం బిల్లుపై వార్షికంగా 30-40 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.
అంతేకాదు.. తాజా లావాదేవీలపై వడ్డీ లేని సమయాన్ని రద్దు చేయొచ్చు. అందుకే పెద్ద మొత్తంలో ఉన్న బిల్లులను చెల్లించడానికి క్రెడిట్ కార్డు హోల్డర్లకు ఈఎమ్ఐ విధానాన్ని కల్పిస్తున్నాయి కార్డు జారీ సంస్థలు.
మొత్తం బిల్లును సమాన వాయిదాల్లో తక్కువ వడ్డీతో, సౌకర్యవంతమైన గడువులో తిరిగి చెల్లింపులు చేసేందుకు వీలుకల్పిస్తున్నాయి. క్రెడిట్ కార్డుతో విలువైన వస్తువును కొనుగోలు చేసి… ఆ మొత్తాన్ని వెంటనే తిరిగి చెల్లించలేని వారూ ఈ వసతిని వాడుకోవచ్చు.
క్రెడిట్ కార్డు బిల్లును ఈఎంఐల్లోకి మార్చుకోవాలని భావించే వారు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.. అవేంటో చూద్దామా..
మొత్తం క్రెడిట్ కార్డు బిల్లు గానీ, అందులో కొంత భాగం ఈఎమ్ఐగా మార్చుకోవచ్చు. ఈ సదుపాయాన్ని వాడుకుంటే భారీ ఫైనాన్స్ ఛార్జీలు, క్రెడిట్ కార్డు బిల్లుపై చెల్లించవలసిన అపరాధ రుసుముల నుంచి బయట పడొచ్చు.
భారీగా ఉన్న బిల్లును ఒకేసారి చెల్లించే కంటే చిన్న చిన్న భాగాలుగా చేసి ఈఎమ్ఐ రూపంలో సులభంగా చెల్లించవచ్చు. కార్డు జారీదారు పేర్కొన్న పరిమితికి మించి లావాదేవీలు చేసినప్పుడు.. ఆ మొత్తాన్ని ఈఎమ్ఐలుగా మార్చేందుకుఈ ఆప్షన్ అనుమతిస్తుంది.
నిర్ధిష్ట కార్డు లావాదేవీలను, ముఖ్యంగా పెద్ద మొత్తంలో చేసే ఖర్చులను ఈఎమ్లుగా మార్చుకునేందుకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అంతే కాదు.. ఒక క్రెడిట్ కార్డు అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్‌ను, మరొక సంస్థ జారీ చేసిన కార్డుకు బదిలీ చేసి, ఆ మొత్తాన్ని ఈఎమ్ఐ మార్చుకోవచ్చు.
క్రెడిట్ కార్డు బిల్లుపై వార్షిక ప్రాతిపదికన దాదాపు 23 నుంచి 49 శాతం ఛార్జీలుఉంటాయి. దీంతో పోలిస్తే, క్రెడిట్ కార్డు ఈఎమ్ఐపై వర్తించే వడ్డీ రేటు తక్కువ. సదరు వ్యక్తి క్రెడిట్ ప్రొఫైల్‌కు అనుగుణంగా క్రెడిట్ కార్డు, తీసుకున్న వ్యక్తి వడ్డీ రేటులో మార్పు ఉంటుంది.
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నవారు, ఈఎమ్ఐలుగా మార్చుకోకుండా.. ఇతర కార్డులకు బదిలీ చేసుకోవచ్చు. అయితే, ఇతర కార్డులకు బదిలీపై ప్రాసెసింగ్ ఫీజు, ఈఎంఐ వడ్డీరేట్లను సరిపోల్చుకోవాలి.
ఆ తర్వాతే ఇతర క్రెడిట్ కార్డులకు బిల్లు మార్చుకోవడమా.. ఈఎంఐల కింద చెల్లించడమా? అన్న విషయమై నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.